
ముషీరాబాద్, వెలుగు: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై భవిష్యత్తు కార్యాచరణ రూపొందించేందుకు ఆగస్టు 3న హైదరాబాద్ లో రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహించనున్నట్లు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య తెలిపారు. ఆదివారం విద్యానగర్ బీసీ భవన్ లో జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ అధ్యక్షతన జరిగిన బీసీ సంఘాల సమావేశంలో ఆయన మాట్లాడారు.
స్థానిక సంస్థల్లో బీసీలకు రాష్ట్ర ప్రభుత్వం వాటా ఇస్తుంటే కొందరు ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు. కుట్రలను తిప్పికొట్టేందుకు బీసీలు పోరాటాలకు సిద్ధంగా ఉండాలన్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో 50 శాతం రిజర్వేషన్లు, కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ, విద్య, ఉద్యోగ రిజర్వేషన్లు 25 శాతం నుంచి 50 శాతానికి పెంపు వంటి తీర్మానాలను సమావేశంలో ఆమోదించారు. కార్యక్రమంలో నీల వెంకటేశ్, జిల్లాపల్లి అంజి, పగిళ్ల సతీశ్, సిరిపురి రవియాదవ్, మోడీ రాందేవ్, రాజ్ కుమార్, మనోజ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.