AUS vs PAK: పోరాడి ఓడిన పాకిస్తాన్.. సెమీస్ ఆశలు సంక్లిష్టం

AUS vs PAK: పోరాడి ఓడిన పాకిస్తాన్.. సెమీస్ ఆశలు సంక్లిష్టం

బెంగళూరు వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. విజయం దోబూచులాడుతూ వచ్చిన ఈ మ్యాచ్‌లో చివరకు ఆసీస్ 62 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. మొదట వార్నర్, మార్ష్ జోడి.. పాక్ బౌలర్లను చీల్చిచెండాడగా, అనంతరం బౌలర్లు విజయ లాంఛనాన్ని పూర్తిచేశారు. ఈ ఓటమితో పాక్ సెమీస్ అవకాశాలు సంక్లిష్టం చేసుకోగా.. విజయం సాధించిన ఆసీస్ పాయింట్ల పట్టికలో పురోగతి సాధించింది. 

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 9 వికెట్ల నష్టానికి 367 పరుగులు భారీ స్కోర్ చేసింది. ఆసీస్ ఓపెనర్లు మార్ష్(121; 108 బంతుల్లో 10 ఫోర్లు, 9 సిక్సులు), వార్నర్(163; 124 బంతుల్లో 14 ఫోర్లు, 9 సిక్సులు) సెంచరీలు బాదారు. ఈ జోడి తొలి వికెట్‌‌కు ఏకంగా 259 పరుగుల భాగస్వామ్యం అందించారు. ఒకానొక సమయంలో ఆసీస్ స్కోర్ 400 దాటుతుందని అనిపించినా.. వీరిద్దరూ వెనుదిరిగాక స్కోర్ బోర్డు మందగించింది. పాకిస్తాన్ బౌలర్లలో షాహీన్ ఆఫ్రిది 5 వికెట్లు తీసుకోగా.. హారిస్ రౌఫ్ 3, ఉసామా మీర్ ఒక వికెట్ తీసుకున్నారు.

ధీటుగా బదులిచ్చింది పాక్

అనంతరం 368 పరుగుల లక్ష్య ఛేదనలో పాకిస్తాన్ ధీటుగానే బదులిచ్చింది. ఓపెనర్లు ఇమామ్ ఉల్ హక్(70), అబ్దుల్లా షఫీక్(64) మంచి అరభాన్ని ఇచ్చిన ఆ తరువాత వచ్చిన బ్యాటర్లు దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయారు. బాబర్ ఆజాం(18), రిజ్వాన్(46), సౌద్ షకీల్(30), ఇఫ్తికార్ అహ్మద్(26) స్వల్ప స్కోరుకే పెవిలియన్ చేరడంతో పాక్ ఓటమి ఖాయమైంది. 45.3 ఓవర్లలో 305 పరుగుల వద్ద పాక్ ఇన్నింగ్స్ ముగిసింది. ఆసీస్ బౌలర్లలో జంపా 4 వికెట్లు పడగొట్టగా.. స్టోయినిస్ 2, కమ్మిన్స్ 2, స్టార్క్ 1, హేజెల్‌వుడ్ ఒక వికెట్ తీసుకున్నారు.