బీఆర్‌‌ఎస్‌ లీడర్లు రాష్ట్రాన్ని దోచుకున్నరు : ఎంపీ వంశీకృష్ణ

బీఆర్‌‌ఎస్‌ లీడర్లు రాష్ట్రాన్ని దోచుకున్నరు : ఎంపీ వంశీకృష్ణ
  • తెలంగాణ ఖజానా ఖాళీ చేసి, అప్పుల కుప్పగా మార్చారు: ఎంపీ వంశీకృష్ణ
  • సింగరేణి నిధులు తరలించుకుపోయారు 
  • ఇసుక, భూ దందాలతో రూ. కోట్లు దండుకున్నరు 
  • క్యాతనపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థుల తరఫున ప్రచారంలో పెద్దపల్లి ఎంపీ

కోల్ బెల్ట్, వెలుగు: గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణను దోచుకొని, రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. ఆదివారం మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీలోని వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా ఆయన ప్రచారం చేశారు. పలు వార్డుల్లో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్‌లలో మాట్లాడారు. కేసీఆర్ పదేండ్లలో రూ.8 లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్ర ఖజానా ఖాళీ చేశారని, కమీషన్ల కోసం మిషన్ భగీరథ, కాళేశ్వరం చేపట్టారని ఆరోపించారు. 

ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా కాంగ్రెస్​ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారంటీలు అమలు చేస్తోందన్నారు. ఇసుక దందాలు, భూ దందాలతో కోట్లు దండుకున్న మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఈ ప్రాంతానికి తీరని అన్యాయం చేశాడని ఆరోపించారు. ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ లెటర్లు ఇచ్చినందుకు కూడా డబ్బులు తీసుకున్నాడని ధ్వజమెత్తారు. 

మంత్రి వివేక్ వెంకటస్వామి చెన్నూరు నియోజకవర్గంలో ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి మార్నింగ్ వాక్ చేస్తున్నారని, సుమన్ ఎన్నడన్నా ప్రజల్లో తిరిగాడా అని ప్రశ్నించారు. ఎన్నికలు ఉన్నప్పుడే అతనికి ప్రజలు గుర్తుకొస్తారని, ఇన్ని రోజులు ఎక్కడకి వెళ్లాడని నిలదీశారు. పదేండ్లలో బీఆర్‌‌ఎస్ ప్రభుత్వం ఒక్కరికి కూడా రేషన్ కార్డు, డబుల్ బెడ్రూమ్‌ ఇల్లు ఇవ్వలేదని, తమ ప్రభుత్వం రాగానే అర్హులందరికీ రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చామని తెలిపారు. 

చెన్నూరు, క్యాతనపల్లిలో  రూ.వందల కోట్లతో అభివృద్ధి..

చెన్నూరులో రూ.500 కోట్లతో, క్యాతనపల్లి మున్సిపాలిటీలో రూ.150 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ఎంపీ వంశీకృష్ణ తెలిపారు. క్యాతనపల్లిలో బీఆర్‌‌ఎస్ పాలనలో ఒక్క శ్మశాన వాటిక కూడా ఏర్పాటు చేయలేదని, మంత్రి వివేక్ వెంకటస్వామి కొత్తగా మూడు శ్మశాన వాటికల నిర్మాణానికి నిధులు మంజూరు చేశారని గుర్తుచేశారు. సింగరేణిలో 80 శాతం ఉద్యోగాలు స్థానికులకు ఇవ్వాలని మంత్రి వివేక్ జీవో తేవడం వల్ల వేల మందికి ఉపాధి దక్కుతుందని చెప్పారు. చెన్నూరు నియోజకవర్గంలో అమృత్‌ స్కీం ద్వారా రూ.100 కోట్లతో చేపట్టిన డ్రింకింగ్ వాటర్ పనులు త్వరలో పూర్తి అవుతాయన్నారు. 

నేషనల్ హైవే జోడు వాగుల వద్ద కొత్త రోడ్డు కోసం రు.100 కోట్లు మంజూరు చేశామని, మంచిర్యాల, రామగుండం రైల్వే స్టేషన్లలో వందే భారత్‌ రైలుకు హాల్టింగ్ ఇప్పించామని గుర్తుచేశారు. పెద్దపల్లి ఎంపీగా వివేక్ వెంకటస్వామి ఉన్నప్పుడు శంకుస్థాపన చేసిన క్యాతనపల్లి ఆర్‌‌వోబీని బాల్క సుమన్ గత పదేండ్లలో పూర్తి చేయలేదని, మళ్లీ వివేక్ వెంకటస్వామి ఎమ్మెల్యేగా గెలిచాకే ఆర్వోబీ అందుబాటులోకి తెచ్చారన్నారు. 

బొగ్గు గనుల వేలాన్ని అడ్డుకున్నరు..

సింగరేణి నిధులను సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్‌కు తరలించి చెన్నూరు అభివృద్ధిని విస్మరించారని ఎంపీ వంశీకృష్ణ విమర్శించారు. చెన్నూరుకు రావాల్సి నిధులు కేసీఆర్ కుటుంబసభ్యులు తరలిస్తుంటే బాల్క సుమన్ ఎందుకు అడ్డుకోలేదని ప్రశ్నించారు. ఎంపీ, ఎమ్మెల్యేగా పదేండ్లలో నియోజకవర్గంలో బాల్క సుమన్ చేసిన అభివృద్ధి శూన్యమన్నారు. 

బొగ్గు బ్లాక్‌ల కేటాయింపు కోసం కేంద్రం అమలు చేస్తున్న వేలంలో సింగరేణి సంస్థ పాల్గొనకుండా బీఆర్ఎస్ సర్కార్ అడ్డుకుందని, దాంతో సింగరేణిలో కొత్త బొగ్గు గనులు రాలేదన్నారు. కోటపల్లి మండలంలోని గ్రామాల్లో రోడ్ల అభివృద్ధికి అటవీ శాఖ అనుమతులు అడ్డంకిగా మారాయని, పర్మిషన్ల కోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నామని చెప్పారు. 

జైపూర్ సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్‌లో నిర్మిస్తున్న 800 మెగావాట్ల మూడో యూనిట్, కొత్తగా వచ్చే ఆర్కేపీ ఓపెన్ కాస్ట్ రెండో ఫేజ్ గని ద్వారా వల్ల వేలాది ఉద్యోగాలు లభిస్తాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ టౌన్ ప్రెసిడెంట్ అల్లె రాజు, మాజీ ఎమ్మెల్సీ, సీనియర్ కార్మిక నేత బి.వెంకట్ రావు, డీసీసీ ప్రెసిడెంట్ పిన్నింటి రఘునాథ్ రెడ్డి, లీడర్లు శ్రీనివాస్, యాకుబ్ అలీ పాల్గొన్నారు.