కమిన్స్‌‌‌‌ సిక్సర్‌‌‌‌..సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌‌‌‌లో 138కే ఆలౌట్‌‌‌‌

కమిన్స్‌‌‌‌ సిక్సర్‌‌‌‌..సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌‌‌‌లో 138కే ఆలౌట్‌‌‌‌
  • బవూమ, బెడింగ్‌‌‌‌హామ్‌‌‌‌ మినహా మిగతా వారు ఫెయిల్‌‌‌‌
  • ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌‌‌‌లో 144/8
  • ప్రస్తుత ఆధిక్యం 218 రన్స్‌

లండన్‌‌‌‌: ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న వరల్డ్‌‌‌‌ టెస్ట్‌‌‌‌ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్లో బౌలర్ల హవానే కొనసాగుతోంది. కంగారూల కెప్టెన్‌‌‌‌ ప్యాట్‌‌‌‌ కమిన్స్‌‌‌‌ (6/28) స్వింగ్‌‌‌‌ దెబ్బకు సఫారీ బ్యాటర్లు చేతులెత్తేశారు. దాంతో 43/4 ఓవర్‌‌‌‌నైట్‌‌‌‌ స్కోరుతో గురువారం రెండో రోజు ఆట కొనసాగించిన సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌‌‌‌లో 57.1 ఓవర్లలో 138 రన్స్‌‌‌‌కే కుప్పకూలింది. ఫలితంగా ఆసీస్‌‌‌‌కు 74 రన్స్‌‌‌‌ తొలి ఇన్నింగ్స్‌‌‌‌ ఆధిక్యం దక్కింది.

డేవిడ్‌‌‌‌ బెడింగ్‌‌‌‌హామ్‌‌‌‌ (45) టాప్‌‌‌‌ స్కోరర్‌‌‌‌. తర్వాత రెండో ఇన్నింగ్స్‌‌‌‌ మొదలుపెట్టిన ఆస్ట్రేలియా ఆట ముగిసే టైమ్‌‌‌‌కు 40 ఓవర్లలో 144/8 స్కోరు చేసింది. మిచెల్‌‌‌‌ స్టార్క్‌‌‌‌ (16 బ్యాటింగ్‌‌‌‌), నేథన్‌‌‌‌ లైయన్‌‌‌‌ (1 బ్యాటింగ్‌‌‌‌) క్రీజులో ఉన్నారు. అలెక్స్‌‌‌‌ క్యారీ (43) మినహా మిగతా వారు నిరాశపర్చారు. రబాడ, ఎంగిడి చెరో మూడు వికెట్లతో ఆసీస్‌‌‌‌ ఇన్నింగ్స్‌‌‌‌ను దెబ్బతీశారు.  ప్రస్తుతం కంగారూలు 218 రన్స్‌‌‌‌ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మూడు రోజుల ఆట మిగిలి ఉంది. 

పెవిలియన్‌‌‌‌కు క్యూ..

తొలి రోజు తేలిపోయిన కమిన్స్‌‌‌‌.. రెండో రోజు మాత్రం తన పేస్‌‌‌‌, స్వింగ్‌‌‌‌ మిక్సింగ్‌‌‌‌తో సౌతాఫ్రికా లైనప్‌‌‌‌ను బెంబేలెత్తించాడు. రెండో రోజు మిగిలిన ఆరు వికెట్లు తీసి సఫారీలను తక్కువ స్కోరుకే కట్టడి చేశాడు. ఓవర్‌‌‌‌నైట్‌‌‌‌ బ్యాటర్లు బవూమ (36), బెడింగ్‌‌‌‌హామ్‌‌‌‌ ఉన్నంతసేపు ఇన్నింగ్స్‌‌‌‌ మెరుగ్గా కనిపించినా ఆ తర్వాతే ఘోరంగా తడబడింది. డే ఏడో ఓవర్‌‌‌‌లోనే కమిన్స్‌‌‌‌.. బవూమాను ఔట్‌‌‌‌ చేసి ఐదో వికెట్‌‌‌‌కు 64 రన్స్‌‌‌‌ భాగస్వామ్యాన్ని ముగించాడు. అవతలివైపు హాజిల్‌‌‌‌వుడ్‌‌‌‌ (1/27), స్టార్క్‌‌‌‌ (2/41) రన్స్‌‌‌‌ కట్టడి చేసినా వికెట్లు తీయలేకపోయారు.

మధ్యలో కైల్‌‌‌‌ వెరియానె (13) ఆసీస్‌‌‌‌ బౌలింగ్‌‌‌‌ను దీటుగా ఎదుర్కొనే ప్రయత్నం చేశాడు. కానీ సక్సెస్‌‌‌‌ కాలేదు. రెండో ఎండ్‌‌‌‌లో బెడింగ్‌‌‌‌హామ్‌‌‌‌ డిఫెన్స్‌‌‌‌కు కట్టుబడటంతో ఆరో వికెట్‌‌‌‌కు 32 రన్స్‌‌‌‌ జతయ్యాయి. ఈ దశలో నాలుగు బాల్స్‌‌‌‌ తేడాలో కమిన్స్‌‌‌‌.. వెరియానె, మార్కో యాన్సెన్‌‌‌‌ (0)ను పెవిలియన్‌‌‌‌కు పంపాడు. ఫలితంగా స్కోరు 126/7గా మారింది. నిలకడగా ఆడుతున్న బెడింగ్‌‌‌‌హామ్‌‌‌‌ను మరో నాలుగు ఓవర్ల తర్వాత కమిన్సే ఔట్‌‌‌‌ చేశాడు. చివర్లో కేశవ్‌‌‌‌ మహారాజ్‌‌‌‌ (7), కగిసో రబాడ (1) బ్యాట్లు ఝుళిపించకపోవడంతో సఫారీ జట్టు చాలా తక్కువ స్కోరుకే పరిమితమైంది. 

ఈసారి ఎంగిడి కూడా..

రెండో ఇన్నింగ్స్‌‌‌‌లో రబాడ, ఎంగిడి ఆసీస్‌‌‌‌ను బాగా కట్టడి చేశారు. రెండు వైపుల నుంచి పదునైన ఇన్‌‌‌‌ స్వింగర్లు, యార్కర్లతో ఆసీస్‌‌‌‌ బ్యాటర్లను నిలువరించారు. ఓపెనర్లలో లబుషేన్‌‌‌‌ (22) ఫర్వాలేదనిపించినా.. 11వ ఓవర్‌‌‌‌లో రబాడ మూడు బాల్స్‌‌‌‌ తేడాలో ఉస్మాన్‌‌‌‌ ఖవాజ (6), కామెరూన్‌‌‌‌ గ్రీన్ (0)ను ఔట్‌‌‌‌ చేశాడు.

రెండో ఎండ్‌‌‌‌లో యాన్సెన్‌‌‌‌ (1/31).. లబుషేన్‌‌‌‌ వికెట్‌‌‌‌ తీయగా, ఎంగిడి వరుస విరామాల్లో స్మిత్‌‌‌‌ (13), బ్యూ వెబ్‌‌‌‌స్టర్‌‌‌‌ (9)ను పెవిలియన్‌‌‌‌కు చేర్చాడు. ఈ దశలో అలెక్స్‌‌‌‌ క్యారీ ఒంటరి పోరాటం చేశాడు. కానీ అవతలి వైపు ఎంగిడి, రబాడ దెబ్బకు ట్రావిస్‌‌‌‌ హెడ్‌‌‌‌ (9), కమిన్స్‌‌‌‌ (6) తడబడ్డారు. దీంతో ఆసీస్‌‌‌‌ 73/7తో కష్టాల్లో పడింది. స్టార్క్‌‌‌‌తో ఎనిమిదో వికెట్‌‌‌‌కు 61 రన్స్‌‌‌‌ జోడించిన క్యారీ ఆసీస్‌‌‌‌కు ఆధిక్యం అందించాడు. 

సంక్షిప్త స్కోర్లు

ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌‌‌‌: 212 ఆలౌట్‌‌‌‌. సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌‌‌‌: 57.1 ఓవర్లలో 138 ఆలౌట్‌‌‌‌ (బెడింగ్‌‌‌‌హామ్‌‌‌‌ 45, బవూమ 36, కమిన్స్‌‌‌‌ 6/28). ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌‌‌‌: 40 ఓవర్లలో 144/8 (క్యారీ 43, రబాడ 3/44, ఎంగిడి 3/35). 

రికార్డులే.. రికార్డులు

ఈ మ్యాచ్‌‌‌‌లో ఆసీస్‌‌‌‌ కెప్టెన్‌‌‌‌ కమిన్స్‌‌‌‌ పలు రికార్డులను సొంతం చేసుకున్నాడు. డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆరు వికెట్లు తీసిన తొలి బౌలర్‌‌‌‌గా నిలిచాడు. అలాగే టెస్ట్‌‌‌‌ల్లో 300 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. ఇక ఐసీసీ ఫైనల్స్‌‌‌‌లో ఐదు వికెట్లు తీసిన తొలి బౌలర్‌‌‌‌గా, అత్యుత్తమ బౌలింగ్‌‌‌‌ గణాంకాలు  (18.1 ఓవర్లు, 6/28) నమోదు చేసి ఫస్ట్‌‌‌‌ బౌలర్‌‌‌‌గా రికార్డులకెక్కాడు.

కలిస్‌‌‌‌ పేరిట (7.3 ఓవర్లు, 5/30) ఉన్న రికార్డును బ్రేక్‌‌‌‌ చేశాడు. డబ్ల్యూటీసీలో అత్యధిక వికెట్లు తీసిన బుమ్రా (77)ను కమిన్స్‌‌‌‌ (79) అధిగమించాడు. లార్డ్స్‌‌‌‌లో బెస్ట్‌‌‌‌ బౌలింగ్‌‌‌‌ చేసిన కెప్టెన్‌‌‌‌గా కమిన్స్‌‌‌‌ (6/28).. బాబ్‌‌‌‌ విల్లీస్‌‌‌‌ (6/101) రికార్డును బద్దలు కొట్టాడు. టెస్ట్‌‌‌‌ల్లో అత్యధిక సార్లు ఐదు వికెట్లు తీసిన బిషన్‌‌‌‌ సింగ్‌‌‌‌ బేడీ (8) రికార్డును కూడా కమిన్స్‌‌‌‌ (9) తుడిచి పెట్టాడు. ఇమ్రాన్‌‌‌‌ ఖాన్‌‌‌‌ (12), రిచీ బెనాడ్‌‌‌‌ (9) ముందున్నారు.