స్టూడెంట్లకు చీప్​గా వీసాలిస్తాం రండి

స్టూడెంట్లకు చీప్​గా వీసాలిస్తాం రండి

కాన్​బెర్రా: మా దేశంలో మస్తు ఉద్యోగాలు ఉన్నయ్.. స్టూడెంట్లకు చీప్​గా వీసాలిస్తాం రండి అని ఆస్ట్రేలియా ప్రధాని మంత్రి స్కాట్ ​మారిసన్ ​ప్రకటించారు. స్టూడెంట్ లేదా వర్కింగ్ హాలిడే వీసాపై ఆస్ట్రేలియా వచ్చే వారికి అప్లికేషన్ ​ఫీజుపై రిబేట్ ఇస్తామని ఆయన పేర్కొన్నారు. కొన్ని నెలలుగా కరోనా వ్యాప్తి పెరిగి దేశంలో రికార్డు స్థాయిలో ఉద్యోగాలు ఖాళీ అయ్యాయి. సూపర్ ​మార్కెట్లు, లాజిస్టిక్, హాస్పిటాలిటీ, అగ్రికల్చర్​ తదితర రంగాల్లో మ్యాన్​పవర్​ కొరత తీవ్రమైంది. దేశ ఆర్థిక వ్యవస్థపై ఎఫెక్ట్​పడనున్న క్రమంలో విదేశీ ఉద్యోగులతో ఖాళీలను భర్తీ చేయడానికి ఆస్ట్రేలియా ప్రభుత్వం వీసాలపై రిబేట్ ​ప్రకటించింది. బుధవారం కాన్​బెర్రాలో నిర్వహించిన ఓ ప్రెస్​ కాన్ఫరెన్స్​లో దేశ ప్రధాని స్కాట్​ మారిసన్​ మాట్లాడుతూ.. మేము తీసుకున్న నిర్ణయం దేశంలో ఉద్యోగుల కొరతను తీరుస్తుందని ఆశిస్తున్నాం.. ‘కమాన్ ఆస్ట్రేలియా రండి.. ఇప్పుడే రండి’ అని ఆయన పిలుపునిచ్చారు. అయితే రిబేట్ ఎలా ఉంటుందనే విషయం చెప్పలేదు. వచ్చే 8 వారాల వరకు స్టూడెంట్లకు వీసాలపై రిబేట్​వర్తిస్తుందని పేర్కొన్నారు. కాగా ప్రభుత్వం వీసాలపై ప్రకటించిన రిబేట్​కు దాదాపు 55 మిలియన్ల ఆస్ట్రేలియన్​ డాలర్లు ఖర్చు అవుతుందని అంచనా. ఈ పాలసీతో 1,75, 000 మంది వీసాలకు దరఖాస్తు చేస్తారని ప్రభుత్వం ఆశిస్తున్నట్లు ట్రెజరర్ ​జోస్ ​ఫ్రైడెన్​బర్గ్​చెప్పారు. కాగా ఆస్ట్రేలియా విదేశీ కార్మికులపై చాలా ఆధారపడుతోందని, కరోనాతో వచ్చిన ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడాలంటే దేశంలో నిరుద్యోగులకు స్కిల్స్​అందించాల్సిన అవసరం ఉందని ప్రతిపక్షనేత ఆంథోనీ అల్బనీస్ తెలిపారు.