దుమ్మురేపిన ఆసీస్..భారత్ టార్గెట్ 187 రన్స్

దుమ్మురేపిన ఆసీస్..భారత్ టార్గెట్ 187  రన్స్

డిసైడర్ మ్యాచ్లో ఆస్ట్రేలియా బ్యాట్స్మన్ దుమ్మురేపారు. టీమిండియా బౌలర్లను చిత్తకొట్టారు. ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఆసీస్కు ఓపెనర్లు ఫించ్, కామెరూన్ గ్రీన్ అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. తొలి వికెట్కు 44 పరుగుల పార్ట్నర్షిప్ను నమోదు చేశారు. ముఖ్యంగా ఓపెనర్ గ్రీన్ రెచ్చిపోయాడు. సిక్సులు, ఫోర్లతో బౌలర్లను ఉతికి ఆరేశాడు. ఈ క్రమంలోనే 21 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అంతేకాకుండా ఆస్ట్రేలియా తరపున తక్కువ బంతుల్లో అర్థ సెంచరీ చేసిన ఆటగాడిగా నిలిచాడు. అయితే మరో ఓపెనర్ ఫించ్ విఫలమయ్యాడు. కేవలం 7 పరుగులు చేసిన ఫించ్.. 44 పరుగుల దగ్గర ఔటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన స్టీవ్ స్మిత్ను చాహల్ బుట్టలో వేసుకున్నాడు. అనంతరం వచ్చిన మాక్స్వెల్ కూడా త్వరగా పెవిలియన్ చేరడంతో..ఆసీస్ 84 పరుగులకే కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. 

ఆదుకున్న డేవిడ్..

పీకల్లోతు కష్టాల్లో ఉన్న ఆసీస్ను టిమ్ డేవిడ్ ఆదుకున్నాడు. సిక్సులు, ఫోర్లతో ఉప్పల్ స్టేడియాన్ని హోరెత్తించాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నా ఏ మాత్రం తగ్గకుండా బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలోనే 25 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. అతనికి జోష్ ఇంగిల్స్ 24 పరుగులతో, డానియల్ సామ్స్ 28 పరుగులతో సహకరించారు. చివరకు ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 7 వికెట్లకు 186 పరుగులు చేసింది.  భారత బౌలర్లలో అక్షర్ పటేల్ 3 వికెట్లు తీసుకున్నాడు. భువీ, చాహల్,  హర్షల్ పటేల్ తలా ఓ వికెట్ పడగొట్టారు.