ఫించ్ భారీ సెంచరీ : శ్రీలంక టార్గెట్ 335

ఫించ్ భారీ సెంచరీ : శ్రీలంక టార్గెట్ 335

లండన్ లోని కెన్నింగ్టన్ ఓవల్ లో జరిగిన వరల్డ్ కప్ 20వ లీగ్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా తన బ్యాటింగ్ పవర్ ఏంటో చూపించింది. శ్రీలంక ముందు 335 పరుగుల భారీ టార్గెట్ పెట్టింది.

టాస్ గెలిచిన శ్రీలంక ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియా ఓపెనర్లు శుభారంభం ఇచ్చారు. డేవిడ్ వార్నర్ 26 రన్స్ చేసి డిసిల్వ బౌలింగ్ లో ఔటయ్యాడు. వన్ డౌన్ లో వచ్చిన ఖవాజా(10) కూడా వెంటనే ఔటయ్యాడు. మరో ఓపెనర్, కెప్టెన్ ఆరోన్ ఫించ్ .. మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ తో కలిసి ఆస్ట్రేలియా భారీ స్కోరుకు బాటలు వేశాడు. ఫించ్ భారీ సెంచరీతో మారథాన్ ఇన్నింగ్స్ ఆడాడు. 97 బాల్స్ లో సెంచరీ పూర్తిచేసిన ఫించ్.. ఆ తర్వాత కూడా జోరు కొనసాగించాడు. స్మిత్ తో కలిసి స్కోరుబోర్డును పరుగులు పెట్టించాడు. 132 బాల్స్ లో 15 ఫోర్లు, 5 సిక్సర్లతో 153 రన్స్ చేసి ఉడానా బౌలింగ్ లో ఔటయ్యాడు. మూడో వికెట్ కు స్మిత్ తో కలిసి 173 రన్స్ పార్ట్ నర్ షిప్ అందించాడు ఫించ్.

ఫించ్ ఔటైన కొద్దిసేపటికే స్మిత్(59 బాల్స్ లో 73, 7 ఫోర్లు, 1 సిక్సర్) కూడా వెనుదిరిగాడు. మాక్స్ వెల్ (25 బాల్స్ లో 46 రన్స్ నాటౌట్, 5 ఫోర్లు, 1 సిక్స్) దూకుడుగా ఆడటంతో ఆస్ట్రేలియా 300 మార్క్ దాటి ముందుకెళ్లింది. పరుగుల వేటలో మార్ష్, కారే, కమిన్స్ వికెట్లను వెంటవెంటనే ఆస్ట్రేలియా కోల్పోయింది. 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 334 రన్స్ చేసింది కంగారూ టీమ్. శ్రీలంక ముందు 335 రన్స్ టార్గెట్ పెట్టింది.

శ్రీలంక బౌలర్లలో డిసిల్వ, ఉడానా చెరో 2 వికెట్లు తీశారు. మలింగ ఒక వికెట్ పడగొట్టాడు.