రాజేంద్రనగర్ వ్యవసాయ యూనివర్శిటీలో.. 2025 నుంచే అగ్రి డ్యూయల్ డిగ్రీ..

రాజేంద్రనగర్ వ్యవసాయ యూనివర్శిటీలో..  2025 నుంచే అగ్రి డ్యూయల్ డిగ్రీ..

గండిపేట, వెలుగు: ఆస్ట్రేలియాలోని వెస్ట్రన్ సిడ్నీ యూనివర్సిటీ వీసీ అయాన్ అండర్సన్, ప్రతినిధులు మంగళవారం రాజేంద్రనగర్​లోని వ్యవసాయ వర్సిటీని సందర్శించారు. వీసీ అల్దాస్ జానయ్య, ఇతర అధికారులతో సమావేశమయ్యారు. ఈ విద్యాసంవత్సరం నుంచి రెండు వర్సిటీలు సంయుక్తంగా బీఎస్సీ అగ్రికల్చర్ కోర్సును ప్రారంభించినట్లు పేర్కొన్నారు. 25 మంది విద్యార్థులు మూడేళ్లు రాజేంద్రనగర్, నాలుగో సంవత్సరం  సిడ్నీ వర్సిటీలో చదువుకుంటారని చెప్పారు. 

తర్వాత పీజేటీఏయూ నుంచి బీఎస్సీ అగ్రికల్చర్, వెస్ట్రన్ సిడ్నీ యూనివర్సిటీ నుంచి బీఎస్సీ వ్యవసాయ ఆహార శాస్త్రంలో డ్యూయల్ ​డిగ్రీని పొందుతారని పేర్కొన్నారు. అనంతరం వెస్ట్రన్ సిడ్నీ యూనివర్సిటీలో  పీజీ, పీహెచ్​డీ కోర్సుల్లో నేరుగా చేరే అవకాశం ఉంటుందన్నారు. అగ్రి రోబోటిక్స్, ఏఐ ఆధారిత సాంకేతిక పరిజ్ఞానంపై ఒప్పందం కుదరడం సంతోషంగా ఉందని తెలిపారు. వెస్ట్రన్ సిడ్నీ వర్సిటీ ప్రొఫెసర్ మార్క్, డాక్టర్ నిషా రాకేశ్, డాక్టర్ కోపల్ చౌబే పాల్గొన్నారు.