ఆస్ట్రేలియా ఓపెన్ గెలిచిన జకోవిచ్..నాదల్ రికార్డు సమం

ఆస్ట్రేలియా ఓపెన్ గెలిచిన జకోవిచ్..నాదల్ రికార్డు సమం

సెర్బియా స్టార్ నోవాక్ జకోవిచ్ చరిత్ర సృష్టించాడు. రికార్డు స్థాయిలో పదో సారి ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్ను సొంతం చేసుకున్నాడు. ఫైనల్లో గ్రీన్ ప్లేయర్ స్టెఫనోస్ సిట్సిపస్ను 6-3,7-6(7-4),7-5 స్కోరు తేడాతో ఓడించి  ఆస్ట్రేలియా ఓపెన్ సింగిల్స్ విజేతగా నిలిచాడు. 

నువ్వా నేనా..

హోరా హోరీగా సాగిన ఫైనల్లో తొలి సెట్లో జకోవిచ్ స్పష్టమైన ఆధిక్యాన్ని చూపించాడు. సూపర్ స్మాష్లు, దుర్భేద్యమైన ర్యాలీలతో సిట్సిపస్కు చెమటలు పట్టించాడు. ఇదే క్రమంలో 6-3తో ఫస్ట్ సెట్ను సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత రెండో సెట్లో సిట్సిపస్ పుంజుకున్నాడు. దీంతో సెట్ టై బ్రేక్కు దారి తీసింది. టై బ్రేక్ లో విజృంభించిన జోకో..7-4తో రెండో సెట్ ను దక్కించుకున్నాడు. ఇక కీలకమైన మూడో సెట్ కూడా టఫ్ గా నడిచింది. సెట్ 6-6తో సమం కావడంతో టై బ్రేక్ కు దారి తీసింది. అయితే టై బ్రేక్ లో జకోవిచ్ అద్బుతంగా ఆడి 7-5తో సెట్తో పాటు మ్యాచ్ను కైవసం చేసుకున్నాడు. 

నాదల్ రికార్డు సమం..

ఆస్ట్రేలియా ఓపెన్ 2023 టైటిల్ గెలవడం ద్వారా అత్యధిక గ్రాండ్ స్లామ్ టైటిళ్లు సాధించిన నాదల్ (22)రికార్డును జకోవిచ్ సమం చేశాడు. అంతేకాదు మరోసారి ప్రపంచ నెంబర్ వన్ ర్యాంకును సొంతం చేసుకున్నాడు. అంతేకాదు ఓటమి ఎరుగని రికార్డును కొనసాగించాడు. ఇప్పటి వరకు జకోవిచ్ ఆస్ట్రేలియా ఓపెన్ లో వరుసగా గత 28 మ్యాచుల్లో విజయం సాధించాడు. మొత్తంగా ఆస్ట్రేలియాలో వరుసగా 41 మ్యాచులు గెలిచాడు.