IPL 2025: రిటర్న్ వచ్చే ఉద్దేశ్యం లేదు: ఐపీఎల్‌కు ఝలక్ ఇచ్చిన ఆస్ట్రేలియా క్రికెటర్లు

IPL 2025: రిటర్న్ వచ్చే ఉద్దేశ్యం లేదు: ఐపీఎల్‌కు ఝలక్ ఇచ్చిన ఆస్ట్రేలియా క్రికెటర్లు

ఐపీఎల్ 2025కు ఆస్ట్రేలియా క్రికెటర్లు ఊహించని షాక్ ఇచ్చారు. ఈ సీజన్ లోని మిగిలిన మ్యాచ్ లు ఆడడానికి ఆసీస్ క్రికెటర్లు ఆసక్తి చూపించట్లేదట. దీంతో ఆయా జట్లు కంగారు పడుతుండగా.. ఐపీఎల్ కళ కాస్త తప్పనుంది. ఇండియా, పాకిస్తాన్ మధ్య సరిహద్దు ఉద్రిక్తతల కారణంగా ఐపీఎల్‌ను వారం పాటు నిలిపివేసిన సంగతి తెలిసిందే. అయితే శనివారం (మే 10) ఇండియా, పాకిస్తాన్ దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. అమెరికా పెద్దన్న పాత్రతో.. రెండు దేశాలు సైనిక చర్యలను నిలిపివేశాయి. దీంతో ఐపీఎల్ రీ స్టార్ట్ కి లైన్ క్లియర్ అయింది. శుక్రవారం (మే 16) నుంచి ఐపీఎల్ 2025 ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తుంది. 

ఈ క్రమంలో ఆస్ట్రేలియా క్రికెటర్లు తమ స్వదేశానికి చేరుకున్నారు. ఐపీఎల్ మరల ప్రారంభం కానుండడంతో వారు తిరిగి వస్తారని బీసీసీఐ భావించింది. అయితే ఆసీస్ క్రికెటర్లు మరల ఇండియాలో అడుగుపెట్టే అవకాశం లేనట్టు కనిపిస్తుంది. ఐపీఎల్‌లో ఆడుతున్న ఆసీస్ జట్టు శనివారం (మే 10) ఇండియా నుంచి విమానాల్లో తమ దేశానికి చేరుకున్నారు. మార్కస్ స్టోయినిస్, మిచెల్ స్టార్క్ ఆదివారం ఆస్ట్రేలియాలో అడుగుపెట్టారు. స్టార్క్ మీడియాతో మాట్లాడటానికి నిరాకరించగా.. అందరూ క్షేమంగా ఉన్నారని స్టోయినిస్ అన్నాడు. 

ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఐపీఎల్‌కు ఖచ్చితంగా వెళ్లాలనే ఒత్తిడి లేదని క్రికెట్ ఆస్ట్రేలియా వారికి భరోసా ఇచ్చింది. మిగిలిన టోర్నమెంట్ కోసం ఆసీస్ ప్లేయర్స్ ఇండియాకు వెళ్లకూడదని నిర్ణయించుకుంటే వారి నిర్ణయాన్ని సమర్థిస్తామని క్రికెట్ ఆస్ట్రేలియా ముందుకొచ్చింది. దీనికి తోడు జూన్ 11 న సౌతాఫ్రికాతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్స్ షిప్ ఫైనల్ ఉండడంతో ఆస్ట్రేలియా జట్టు భారత్ కు రావడం దాదాపుగా అసాధ్యంగా మారింది. డబ్ల్యూటీసీ ఫైనల్ కు ముందు కమ్మిన్స్ సేనకు రెస్ట్ తో పాటు ప్రాక్టీస్ అవసరం. మరి ఇలాంటి సమయంలో ఆసీస్ కక్రికెటర్లు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.