IPL 2027కి హ్యాండిచ్చిన ఆసీస్ క్రికెటర్లు?..  డైలామాలో ఫ్రాంచైజీలు!

IPL 2027కి హ్యాండిచ్చిన ఆసీస్ క్రికెటర్లు?..  డైలామాలో ఫ్రాంచైజీలు!

IPL 2027: రాబోయే రోజుల్లో సుదీర్ఘమైన అంతర్జాతీయ సిరీస్‌లతో నిండిన బిజీ షెడ్యూల్‌ను దృష్టిలో పెట్టుకుని, ఐపీఎల్ 2027లో ఆస్ట్రేలియా ప్రముఖ టెస్టు ప్లేయర్స్ భాగస్వామ్యంపై కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదని హెడ్ కోచ్ ఆండ్రూ మెక్‌డోనాల్డ్ సూచించాడు. రాబోయే 12 నెలల కాలంలో ఆస్ట్రేలియా ఏకంగా 20 టెస్టులు, 14 పరిమిత ఓవర్ల మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఇందులో బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ సిరీస్‌లతో పాటు భారత పర్యటనలో 5 టెస్టులు, ఇంగ్లాండ్‌తో జరిగే ప్రతిష్టాత్మక యాషెస్ (Ashes) సిరీస్, WTC ఫైనల్ కూడా ఉంది. ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, కామరూన్ గ్రీన్, జోస్ ఇంగ్లిస్ లాంటి కీలక ఆటగాళ్లు ప్రస్తుతం ఐపీఎల్ ఫ్రాంచైజీలతో ఒప్పందం చేసుకున్నారు. భారత టెస్టు పర్యటనకు, యాషెస్ సిరీస్‌కు మధ్యలో వచ్చే ఈ టోర్నీలోనే ఫాస్ట్ బౌలర్లకు రెస్ట్ ఇచ్చేందుకు ఛాన్స్ ఉందని మెక్‌డోనాల్డ్ వెల్లడించాడు.

ఐపీఎల్‌ను పూర్తిగా పక్కనబెట్టడం లేదు: ఆస్ట్రేలియా

వర్క్‌లోడ్ ఎక్కువగా ఉన్నప్పటికీ, ఆటగాళ్లను ఐపీఎల్ నుంచి ముందే మినహాయించే ఆలోచన ఏదీ లేదని ఆస్ట్రేలియా హెడ్ కోచ్ ఆండ్రూ మెక్‌డోనాల్డ్ స్పష్టం చేశాడు. గతంలో 2023లో కమిన్స్, స్టార్క్ ఐపీఎల్‌కు దూరమై డబ్ల్యూటీసీ, యాషెస్, వన్డే వరల్డ్ కప్‌లలో ఆసీస్‌ను విజేతగా నిలిపిన విషయాన్ని గుర్తు చేశాడు. అయితే, ప్రస్తుత విధానంలో మ్యాచ్- టు -మ్యాచ్ సమీక్షించి, మెడికల్ టీమ్‌తో చర్చించిన తర్వాతే నిర్ణయాలు తీసుకుంటామన్నాడు.

ఆస్ట్రేలియా ఆడబోయే టోర్నీలు: 

* బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా టెస్టులు: డార్విన్, మెకే వేదికగా బంగ్లాదేశ్‌తో 2 టెస్టులు, ఆపై దక్షిణాఫ్రికాతో 3 టెస్టులు.

* బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ: భారత్‌లో ఐదు టెస్టుల సుదీర్ఘ పర్యటన.

* 150వ వార్షికోత్సవ టెస్టు, యాషెస్: మార్చిలో ఇంగ్లాండ్‌తో ప్రత్యేక టెస్టు, ఆపై జూన్-జులైలలో ఇంగ్లాండ్ నేలపై యాషెస్ సిరీస్.

ఫామ్ తగ్గడానికి ఐపీఎల్ కారణం కాదు: 

ఆర్సీబీ ప్లేయర్ కామెరూన్ గ్రీన్ ఉదాహరణగా తీసుకుని.. ఐపీఎల్ ఆడటం వల్లే ఆటగాళ్ల ఫామ్ దెబ్బతింటుందనే ప్రచారాన్ని మెక్‌డోనాల్డ్ తోసిపుచ్చాడు. విభిన్న ఫార్మాట్లలోకి మారడం క్రీడాకారులకు సవాలే అయినప్పటికీ, ఒక సిరీస్ వైఫల్యానికి అంతకు ముందు ఆడిన టోర్నీని నిందించడం సరికాదన్నాడు.