- మైనింగ్ విద్యలో అంతర్జాతీయ ప్రమాణాలపై ప్రత్యేక దృష్టి
- రాష్ట్ర స్థాయి టాస్క్‌ఫోర్స్ ఏర్పాటుకు నిర్ణయం
హైదరాబాద్, వెలుగు: తెలంగాణలో మైనింగ్ విద్యను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే దిశగా తెలంగాణ హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ కీలక అడుగులు వేస్తున్నది. ఇందులో భాగంగా ఆస్ట్రేలియాలోని మోనాష్ యూనివర్సిటీ ప్రొఫెసర్, క్రిటికల్ మినరల్స్ కన్సార్టియం కో-ఫౌండర్ మోహన్ యెల్లిశెట్టి శనివారం టీజీసీహెచ్ఈ చైర్మన్ ప్రొఫెసర్ వి.బాలకిష్టారెడ్డితో సమావేశమయ్యారు. ఇటీవల రాష్ట్రంలో ఏర్పాటైన ‘డాక్టర్ మన్మోహన్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ’ అభివృద్ధి, విధివిధానాలపై వీరిద్దరూ చర్చించారు. మోహన్ గతంలో ‘కొత్తగూడెం స్కూల్ ఆఫ్ మైన్స్’ విద్యార్థి కావడం విశేషం.
సొంత గడ్డపై మైనింగ్ రంగాన్ని అభివృద్ధి చేయాలనే ఆకాంక్షతో ఆయన తన సహకారాన్ని అందించేందుకు ముందుకొచ్చారు. మైనింగ్, ఎక్విప్‌మెంట్, టెక్నాలజీ అండ్ సర్వీసెస్ రంగంలో ఆస్ట్రేలియా ప్రపంచ ప్రసిద్ధి గాంచింది. అక్కడి అత్యుత్తమ విధానాలు, పరిశ్రమ విద్యాసంస్థల అనుసంధానం, సుస్థిర మైనింగ్ పద్ధతులను తెలంగాణ విద్యార్థులకు అందించే విషయంపై మోహన్ తన సంసిద్ధతను వ్యక్తం చేశారు.
కీలక నిర్ణయాలు, యాక్షన్ ప్లాన్
- పరిశ్రమ నిపుణులు, విద్యావేత్తలు, ప్రభుత్వ అధికారులతో కూడిన రాష్ట్ర స్థాయి టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయడం.
- రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న మైనింగ్ కోర్సులు, విద్యాసంస్థల స్థితిగతులను సమీక్షించి, వాటిని క్రమబద్ధీకరించడం.
- మైనింగ్ వాల్యూ చైన్‌కు అవసరమైన స్కిల్స్‌ను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా పెంచేలా సిలబస్ రూపొందించడం.
- భవిష్యత్ సవాళ్లను ఎదుర్కొనేలా రీసెర్చ్ బేస్డ్ విద్యా విధానాన్ని ప్రోత్సహించడం.
