చాన్స్ ఎవరికి వస్తుందో..! పంచాయతీ రిజర్వేషన్లపై ఉత్కంఠ..పల్లెల్లో మళ్లీ ఎన్నికల సందడి షురూ

చాన్స్ ఎవరికి వస్తుందో..! పంచాయతీ రిజర్వేషన్లపై ఉత్కంఠ..పల్లెల్లో మళ్లీ ఎన్నికల సందడి షురూ

మెదక్/సిద్దిపేట/సంగారెడ్డి, వెలుగు: గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం కసరత్తు ముమ్మరం చేసింది. ఓటర్ల జాబితా సవరణతో పాటు, ఒక కుటుంబంలోని ఓట్లు అన్నీ ఒకే వార్డులో ఉండేలా మ్యాపింగ్ చేసే ప్రక్రియ మొదలైంది. మరోవైపు 50 శాతం పరిమితికి లోబడి ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ ఖరారు చేస్తూ డెడికేషన్ కమిషన్ రూపొందించిన నివేదిక ప్రభుత్వానికి అందింది. 

ఆ నివేదిక ఆధారంగా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఎంపీడీవోలు సర్పంచ్, వార్డ్ మెంబర్ స్థానాల రిజర్వేషన్ ప్రక్రియ చేపట్టారు. రిజర్వేషన్లు ఖరారు కానుండడంతో పాటు ఆ వెంటే ఎన్నికల షెడ్యూల్ వెలువడనుండడంతో గ్రామాల్లో మళ్లీ ఎన్నికల సందడి మొదలైంది. రిజర్వేషన్లు మారనుండడంతో ఏ పంచాయతీ ఎవరికి రిజర్వు అవుతుంది? అవకాశం వస్తుందా ? రాదా? మహిళలకు రిజర్వు అయితే ఏం చేద్దాం అని ఆశావహుల మధ్య చర్చ మొదలైంది.

మరోవైపు కొందరు పోటీకి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. రిజర్వేషన్లు మారుతాయన్న ప్రచారం నేపథ్యంలో ఆశావాహుల్లో టెన్షన్ మొదలైంది. సర్పంచ్, వార్డు స్థానాల్లో నిలబడేందుకు ఇప్పటికే ప్లాన్ చేసుకున్న ఆశవాహులు రిజర్వేషన్ల ప్రకటనపై ఎదురుచూస్తున్నారు. పోటీలో నిలవాలని భావిస్తున్న అభ్యర్థులు ఇప్పటికే గ్రామాల్లోని ప్రజలను కలుసుకుంటూ మద్దతు ప్రయత్నాలు మొదలుపెట్టారు.

రిజర్వేషన్లు ఎలా ఉన్నా కుటుంబం నుంచి ఎవరైనా పోటీ చేయించడానికి కొందరు సిద్దపడి ఓటు బ్యాంకు చేజారకుండా  ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఆశావహులు గ్రామానికి చేసే తమ పనుల వివరాలను బహిరంగంగా ప్రకటించకున్నా గ్రామస్తులతో పాటు కుల సంఘాల పెద్దలను కలిసి తమ ప్రణాళికలను వెల్లడిస్తూ మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు.

గ్రామానికి అవసరమైన పనులు, సమస్యలను వెంట వెంటనే పరిష్కరిస్తామని వ్యక్తిగతంగా హామీలు గుప్పిస్తున్నారు. రిజర్వేషన్ల అనుకూలించకున్నా కుటుంబ సభ్యలును బరిలో నిలపాలనే నిర్ణయంతో ఉన్న వారు తమదైన రీతిలో ప్రయత్నాలు ప్రారంభించారు.

సిద్దిపేట జిల్లా

గ్రామ పంచాయతీలు:          508
వార్డులు:                             4,508
మొత్తం ఓటర్లు :            6,55,958
మహిళలు:                     3,34,186
పురుషులు:                    3,21,766
ఇతరులు:                                06

సంగారెడ్డి జిల్లా 

గ్రామ పంచాయతీలు:       613 
వార్డులు:                             5,370 
మొత్తం ఓటర్లు:                 7,44,157 
పురుషులు:                        3,68,270 
మహిళలు :                        3,78,843 
ఇతరులు:                          44

మెదక్ జిల్లా

గ్రామ పంచాయతీలు:                492
వార్డులు:                                      4,220
మొత్తం ఓటర్లు:                           5,23,327
మహిళలు:                                   2,71,787
పురుషులు:                                  2,51,532
ఇతరులు:                                    8