
- గ్రామీణ ప్రాంతాల్లో టెన్త్ పాస్కాగానే పెళ్లిళ్లు
- ఇంటర్లో చేర్పించాలనే పట్టుదలతో అధికారులు
మెదక్, వెలుగు: జిల్లాలో ప్రతి ఏటా పది వేల మంది స్టూడెంట్స్కు పైగా పదో తరగతి పాసవుతున్నారు. కానీ వారందరూ ఇంటర్ లో చేరడం లేదు. దాదాపు మూడు, నాలుగు వేల మంది పదో తరగతితో చదువుకి ఫుల్ స్టాఫ్ పెడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో, గిరిజన తండాల్లో తల్లిదండ్రులు తమ బాధ్యత తీర్చుకోవాలని అమ్మాయిలకు పెళ్లిళ్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు ఈ సారి పదో తరగతి పాసైన వారందరినీ ఇంటర్ లో చేర్పించడంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. 2024–25 విద్యా సంవత్సరంలో జిల్లాలో మొత్తం 10,045 మంది స్టూడెంట్స్పదో తరగతి పాసయ్యారు. వారిలో బాలురు 4,994 మంది, బాలికలు 5,376 మంది ఉన్నారు.
అందరూ ఇంటర్ లోకి..
జిల్లాలో 16 ప్రభుత్వ జూనియర్ కాలేజీలతో పాటు, 6 కేజీబీవీలు, 7 మోడల్, 4 సోషల్ వెల్ఫేర్, 6 ట్రైబల్ వెల్ఫేర్, 2 మైనార్టీ వెల్ఫేర్, 6 మహాత్మా జ్యోతిబాపూలే, 2 రెసిడెన్షియల్, 10 ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి. పదో తరగతి పాసైన స్టూడెంట్స్, వారి పేరెంట్స్ కు అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ఒక్కరు తప్పి పోకుండా అందరూ ఇంటర్ లో జాయిన్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్రాహుల్రాజ్సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ మేరకు విద్యాశాఖ అధికారులు ఆ దిశగా అవగాహన సదస్సులు నిర్వహణకు కార్యాచరణ రూపొందిస్తున్నారు.
బాల్య వివాహాలు జరగకుండా..
జిల్లాలో తరచూ బాల్య వివాహాలు వెలుగు చూస్తున్నాయి. కౌడిపల్లి, చిలప్ చెడ్, శివ్వంపేట తదితర మండలాల్లోని గ్రామాలు, గిరిజన తండాల్లో ఆడ పిల్లలకు వయసు రాకముందే పెళ్లి చేస్తున్నారు. పదోతరగతి పూర్తి చేసుకున్న అమ్మాయిలు వివిధ కారణాలతో అక్కడితో చదువుకు ఫుల్ స్టాఫ్ పెడుతున్నారు. ఈ నేపథ్యంలో బాల్య వివాహాలు జరగకుండా చూడాలని కలెక్టర్ మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులకు సూచించారు. అంగన్ వాడీ టీచర్స్ కు ఆ బాధ్యత అప్పగించాలని చెప్పారు. తమ పరిధి గ్రామాలు, తండాల్లో పదోతరగతి పూర్తి చేసిన అమ్మాయిలు ఎవరెవరూ ఉన్నారనేది గుర్తించి వారి ఇండ్లకు వెళ్లి ప్రభుత్వం నిర్దేశించిన పెళ్లి వయసు గురించి చెప్పడంతో పాటు, బాల్య వివాహాలు చేయడం వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించాలని సూచించారు.