రేగులకుంట చెరువు సర్వే..బఫర్జోన్ బయటే ఉందంటూ రిపోర్ట్

రేగులకుంట చెరువు సర్వే..బఫర్జోన్ బయటే ఉందంటూ రిపోర్ట్

 

  • 2020 రాజేంద్రనగర్​ ఆర్డీవో  నివేదికకు, ప్రస్తుత రిపోర్టుకు తేడా  
  • అప్పట్లో చెరువు స్థలంగా పేర్కొన్న ఆర్డీవో  

చందానగర్​, వెలుగు: శేరిలింగంపల్లి మండలం హఫీజ్​పేట పరిధిలో రేగులకుంట చెరువు స్థలం కబ్జాపై అధికారులు స్పందించారు. వెలుగు దినపత్రికలో  రెండు రోజుల కింద రేగులకుంట జాగాకు ఎసరు అనే హెడ్డింగ్​తో వచ్చిన కథనానికి స్పందించిన శేరిలింగంపల్లి రెవెన్యూ, ఇరిగేషన్​శాఖ అధికారులు మంగళవారం సర్వే చేపట్టారు. చెరువు ఎఫ్టీఎల్, బఫర్​ జోన్​ఎక్కడి వరకు విస్తరించి ఉందో చూస్తూ హద్దులు చెక్​చేశారు.

 ప్రస్తుతం బై నంబర్లు వేసి చేపడుతున్న నిర్మాణం వద్ద సర్వే చేపట్టిన అధికారులు.. బఫర్ జోన్ బయటే ఉన్నట్టు తేల్చి గుర్తులు పెట్టారు. అయితే, ప్రస్తుత నిర్మాణంతో పాటు పక్కనే ఉన్న అపార్ట్​మెంట్​లోని కొంత భాగం, వెనుక వైపు ఉన్న పలు నిర్మాణాలు చెరువు స్థలాన్ని కబ్జా చేసి కట్టారని 2020లో అప్పటి రాజేంద్రనగర్​ఆర్డీవో సర్వే చేసి రిపోర్టు ఇచ్చారు. 

కానీ, ఇప్పుడు 513/2, 513/3, 516 తూర్పు భాగం ప్లాట్ల నంబర్లతో చేపడుతున్న నిర్మాణం మాత్రం బఫర్​జోన్​బయట ఉందని అధికారులు తేల్చడం వెనక మతలబు ఏమిటో అర్థం కావడం లేదని స్థానికులు అంటున్నారు. చెరువు స్థలాన్ని కబ్జా చేసి, రిజిస్ట్రేషన్​ చేసుకోవడం, బై నంబర్లు వేసి ఇరిగేషన్​ నుంచి ఎన్​ఓసీ, బల్దియా నుంచి బిల్డింగ్​నిర్మాణానికి అనుమతులు తీసుకురావడం వరకు అన్నీ ఓ డివిజన్​ కార్పొరేటర్​ దగ్గరుండి చూసుకున్నట్టు తెలుస్తోంది.