ప్రతి సిటీలో ఆటో డంపింగ్ యార్డులు ఓపెన్ చేయండి : కేంద్రం అలర్ట్

ప్రతి సిటీలో ఆటో డంపింగ్ యార్డులు ఓపెన్ చేయండి : కేంద్రం అలర్ట్

చెత్త అనగానే మనకు డంపింగ్ యార్డు గుర్తుకొస్తుంది.. దేశంలోని 140 కోట్ల మంది వాడి పడేస్తున్న చెత్త, చెదారం, ఆహారాన్ని నాశనం చేయటం అనేది పెద్ద సవాల్ గా మారింది. ఇళ్ల నుంచి సేకరించిన చెత్తను పడేయటానికి ఇప్పటికే ప్రతి మహా నగరంతోపాటు ఇతర నగరాల్లోనూ పెద్ద పెద్ద డంపింగ్ యార్డులు ఉన్నాయి. కాలం మారింది..

చెత్తలోనూ కొత్త రకం వచ్చింది. వీటిలో ప్రధానమైనది ఆటో.. ఆటోమొబైల్ రంగం. ప్రస్తుతం దేశంలోనే కాదు నగరాల్లోనూ కార్లు, బైకులు, ఇతర వాహనాల సంఖ్య లక్షల్లో ఉంటుంది. వీటి నుంచి వచ్చే వేస్ట్ అంటే.. పాడైపోయిన విడి భాగాలు, దేనికీ పనికిరాని వస్తువులను నాశనం చేయటం అనేది ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఎదుర్కొంటున్న సమస్య. దీన్ని పరిష్కరించేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నది. ఆటో వేస్ట్ కోసం ప్రతి నగరంలో ప్రత్యేకంగా డంపింగ్ యార్డులు ఓపెన్ చేయాలని సూచించింది కేంద్ర ప్రభుత్వం. 

మారుతీ సుజుకి, టాటా మోటార్స్‌తో సహా కొన్ని ఆటో తయారీదారులు ఇప్పటికే తమ వాహనాల స్క్రాపింగ్ కేంద్రాలను దేశవ్యాప్తంగా ప్రారంభించాయి. అయితే, స్క్రాప్ చేయాల్సిన పాత వాహనాల సంఖ్యతో పోలిస్తే భారతదేశం అంతటా వాహనాల స్క్రాపింగ్ కేంద్రాల సంఖ్య చాలా తక్కువగా ఉంది. మరిన్ని వాహనాల స్క్రాపింగ్ కేంద్రాలను ప్రారంభించడం ప్రక్రియను వేగవంతం చేస్తుంది. అందుకే, ఆటోమొబైల్ డీలర్లు ఇలాంటి సౌకర్యాలను ఏర్పాటు చేసేందుకు ముందుకు రావాలని  కేంద్రమంత్రి గడ్కరీ పేర్కొన్నారు.

వాహన స్క్రాపింగ్ విధానం వల్ల ఆటోమొబైల్ విక్రయాలు 18 శాతం పెరుగుతాయని మంత్రి తెలిపారు. స్క్రాప్డ్ వాహనాల నుంచి లభించే ముడి పదార్థాలను ఉపయోగించడం వల్ల ముడిసరుకు సేకరణపై 33 శాతం ఖర్చు ఆదా అవుతుందని, కొత్త వాహనాల విక్రయాలు 18-20 శాతం పెరుగుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. అలాగే, భారతదేశాన్ని గ్లోబల్ ఆటోమొబైల్ తయారీ హబ్‌గా మార్చడంలో ఈ విధానం కీలక పాత్ర పోషిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.