
మంచి మనుషుల ముసుగులో మృగాళ్లు ఉంటారంటే ఇదే నేమో. ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న 11 ఏళ్ల బాలికను.. ఇంటి దగ్గర ఫ్రీగా డ్రాప్ చేస్తానని చెప్పి చివరికి తనలోని మృగ తృష్ణను బయటపెట్టాడు ఓ దుర్మార్గుడు. హైదరాబాద్ లో మంగళవారం (అక్టోబర్ 14) జరిగిన ఈ కిడ్నాప్ ఇన్సిడెంట్ స్థానికులను, పోలీసులను ఆందోళనకు గురిచేసింది.
ఓల్డ్ సిటీలోని మీర్ చౌక్ లో ఆర్మాన్ హోటల్ దగ్గర ఫుట్ పాత్ పై ఓ బాలిక నడుచుకుంటూ వెళ్తుండగా.. అటుగా వచ్చిన ఆటో డ్రైవర్ షబ్బీర్ అలీ ఆ బాలిక ముందు ఆగాడు. ఎక్కడికి వెళ్తున్నావని అడిగాడు. తను కూడా అటే వెళ్తున్నానని.. ఇంటి దగ్గర డ్రాప్ చేస్తానని అడిగాడు. అప్పటికీ బాలిక ఆటో ఎక్కక పోవడంతో.. మీ నాన్న నాకు తెలుసు.. ఇంటి వద్ద వదిలేస్తా.. ఎక్కు అంటూ ఒత్తిడి చేశాడు. అయినా బాలిక ఆటో ఎక్కక పోవడంతో భయపెట్టి ఆటో ఎక్కించాడు.
అక్కణ్నుంచి మలక్ పేట్ వైపు తీసుకెళ్తుండటంతో బాలిక గట్టిగా అరవటం ప్రారంభించింది. దీంతో గట్టిగా అరుస్తూ బెదిరించాడు. చెప్పిన పని చేయమని.. చివరికి బట్టలు ఇప్పమని భయపెట్టాడు. దీంతో భయంతో ఆ బాలిక కదులుతున్న ఆటో నుంచి దూకేసింది. కేకలు వేస్తూ పాపరిపోతున్న బాలికను వెంబడించే ప్రయత్నం చేశాడు ఆటో డ్రైవర్.
బాలిక అరుపులు విన్న స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని ఆటో డ్రైవర్ ను మలక్ పేట పోలీస్ స్టేషన్ లో అప్పగించారు. ఆటో డ్రైవర్ ను కస్టడీలోకి తీసుకుని పక్సో కేసు నమోదు చేశారు పోలీసులు.