అమ్మకాలు అదుర్స్..2025లో బండ్ల సేల్స్ 7.71 శాతం జంప్

అమ్మకాలు అదుర్స్..2025లో బండ్ల సేల్స్ 7.71 శాతం జంప్
  •  
  • 2.81 కోట్ల వెహికల్స్​ అమ్మకం.. ఫాడా రిపోర్ట్​ వెల్లడి

న్యూఢిల్లీ:  మనదేశంలో గడచిన ఏడాది బండ్ల అమ్మకాలు అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే 7.71 శాతం పెరిగి 2,81,61,228 యూనిట్లకు ఎగిశాయని వాహన డీలర్ల సంఘాల సమాఖ్య (ఫాడా) వెల్లడించింది. 2024లో ఈ విక్రయాలు 2,61,45,445 యూనిట్లుగా ఉన్నాయి. జీఎస్టీ 2.0 అమలు కావడంతో ఏడాది మొదట్లో ఉన్న మందగమనం తగ్గుముఖం పట్టింది. ప్యాసింజర్​ వెహికల్స్​ (పీవీ) అమ్మకాలు 9.7 శాతం వృద్ధితో 44,75,309 యూనిట్లకు చేరాయి.  టూవీలర్స్​సేల్స్​ 7.24 శాతం పెరిగి 2,02,95,650 యూనిట్లుగా ఉన్నాయి. త్రీవీలర్​సేల్స్​​7 .21 శాతం పెరిగి 13,09,953 యూనిట్లకు దూసుకెళ్లాయి. కమర్షియల్​ వెహికల్స్​ (సీవీ) అమ్మకాలు 6.71 శాతం ఎగిసి 10,09,654 యూనిట్లుగా నమోదయ్యాయి. ఫాడా ప్రెసిడెండ్ విఘ్నేశ్వర్ మాట్లాడుతూ 2025 ఫలితాలను రెండు భాగాలుగా విడదీయవచ్చని చెప్పారు. ‘‘జనవరి నుంచి ఆగస్టు వరకు అమ్మకాలు తక్కువగా ఉన్నాయి. కేంద్ర బడ్జెట్ లో పన్ను తగ్గింపులు ఉన్నా, ఆర్​బీఐ వడ్డీ రేట్లను తగ్గించినా వినియోగదారులు ఆచితూచి ఖర్చు చేశారు. సెప్టెంబర్ నుంచి జీఎస్టీ 2.0 అమలులోకి వచ్చాక చిన్న కార్లు, టూవీలర్లు, కమర్షియల్​ వెహికల్స్​పై పన్నులు తగ్గడంతో కొనుగోళ్లు పెరిగాయి. ఈ మార్పు వల్ల సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు విక్రయాలు ఊపందుకున్నాయి. ఈవీలు, సీఎన్జీ వెహికల్స్​ వాటా కూడా గణనీయంగా పెరిగింది” అని ఆయన వివరించారు.

కొత్త ఏడాదిపై సానుకూలమే..

ఈ ఏడాది అమ్మకాలపై ఫాడా సానుకూలంగా ఉంది. రాబోయే మూడు నెలల్లో అమ్మకాలు పెరుగుతాయని 74.91 శాతం డీలర్లు నమ్ముతున్నారు. పండుగలు, పెళ్లిళ్ల సీజన్ తో పాటు ఆర్థిక సంవత్సరం ముగింపులో జరిగే కొనుగోళ్లు డిమాండ్ ను పెంచుతాయని భావిస్తున్నారు. రబీ పంటలు, వాతావరణ పరిస్థితులు బాగుండటం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఆదాయం పెరిగి అమ్మకాలకు తోడ్పడుతుంది. ఆర్​బీఐ రెపో రేటు ఐదు.25 శాతంగా ఉండటం లోన్ల భారాన్ని తగ్గిస్తుంది. తయారీ సంస్థలు ధరలు పెంచే అవకాశం ఉన్నా వినియోగదారులు కొనుగోలుకు మొగ్గు చూపే అవకాశం ఉంది. సరైన సమయంలో వెహికల్స్​ సరఫరా జరిగి లోన్లు సులభంగా అందితే 2026లో మరిన్ని మెరుగైన ఫలితాలు రావచ్చని ఫాడా తెలిపింది.