అవధూత్ సాథేపై సెబీ నిషేధం.. ఫిన్‌ఫ్లూయెన్సర్ ఖాతాల్లోని రూ.546 కోట్లు ఫ్రీజ్.. అసలు ఎవరితను?

అవధూత్ సాథేపై సెబీ నిషేధం.. ఫిన్‌ఫ్లూయెన్సర్ ఖాతాల్లోని రూ.546 కోట్లు ఫ్రీజ్.. అసలు ఎవరితను?

దేశంలో ఫైనాన్షియల్ అడ్వైజర్ గా చెలామణి అవుతూ.. సరైన లైసెన్స్ లేకుండా వేలాది మంది రిటైల్ ఇన్వెస్టర్లను తప్పుదోవ పట్టించిన ఫిన్‌ఫ్లూయెన్సర్‌లపై మార్కెట్ రెగ్యులేటరీ సంస్థ సెబీ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో కఠిన చర్యలు తీసుకుంది. అవధూత్ సాథే ట్రేడింగ్ అకాడమీ(ASTA) వ్యవస్థాపకుడు అవధూత్ సాథేను సెక్యూరిటీస్ మార్కెట్ నుంచి నిషేధించడమే కాకుండా.. ఆయనకు చెందిన బ్యాంక్ ఖాతాల నుంచి రూ.546 కోట్లను జప్తు చేయాలని ఆదేశించింది. ఇదొక ఫిన్‌ఫ్లూయెన్సర్‌పై సెబీ తీసుకున్న భారీ మొత్తపు చర్యగా నిలిచింది.

పెట్టుబడులపై ఎడ్యుకేషన్ పేరుతో రియల్-టైమ్ ట్రేడింగ్ సలహాలు ఇస్తున్నట్లు గుర్తించింది సెబీ. దీంతో సేథే అకాడమీ కేవలం ట్రేడింగ్ కోర్సులను అందిస్తున్నట్లు ప్రచారం చేసుకుంటూ.. ఇన్వెస్ట్మెంట్ టిప్స్, రియల్ టైం ట్రేడింగ్ సూచనలు అందిస్తున్నట్లు గుర్తించింది సెబీ. సాథే, అతని బృందం రియల్-టైమ్ లైవ్ మార్కెట్ సెషన్లలో నేరుగా షేర్లు కొనటం, అమ్మకాలపై వాట్సాప్ చానళ్ల ద్వారా సూచనలు ఇవ్వడం, నిర్దిష్ట ధరకు ఎంట్రీ పాయింట్, స్టాప్-లాస్, టార్గెట్ లాంటి వివరాలతో సహా బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్ ట్రేడ్‌లు చేయమని సూచించినట్లు సెబీ గుర్తించింది. ఇది ఎడ్యుకేషన్ పరిధిలోకి రావని, లైసెన్స్ లేకుండా ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరీ సేవలు అందించటం కిందికొస్తుందని సెబీ స్పష్టం చేసింది.

సెబీ దర్యాప్తులో గుర్తించిన కీలక అంశాలు:
* లైవ్ ట్రేడింగ్ సెషన్ వీడియోలు, వాట్సాప్ సందేశాలు, సోషల్ మీడియా కంటెంట్ గుర్తింపు.
* అధిక ఫీజులు చెల్లించే వందలాది మంది ట్రేడర్లతో ప్రైవేట్ వాట్సాప్ గ్రూపుల ద్వారా రియల్ టైం గైడెన్స్.
* ట్రేడర్ జీవితాన్ని మార్చే హామీలు, లాభాల స్క్రీన్షాట్‌లతో తప్పుడు ప్రచారం.
* కొన్ని కోర్సుల ఫీజు ఒక్కొక్కరికి రూ.6.75 లక్షలు వరకు వసూళ్లు.

అవధూత్ సాథే ట్రేడింగ్ అకాడమీ తరచుగా "గ్యారెంటీడ్ రిటర్న్స్" వస్తాయనే భావనను ఎడ్యుకేషన్ పేరుతో ట్రేడర్లకు కల్పించిందని సెబీ పేర్కొంది. ఇలాంటి ప్రచారం పెట్టుబడిదారుల రక్షణ నిబంధనలకు పూర్తిగా విరుద్ధమని చెప్పింది. 2024లో ముందే ఒక ఫార్మల్ వార్నింగ్ అందుకున్నప్పటికీ.. సాథే తన కార్యకలాపాలను ఆపకుండా, మరింత రహస్యంగా నిర్వహించడాన్ని సెబీ తీవ్రంగా పరిగణించింది. దీంతో అవధూత్ సాథే, డైరెక్టర్ గౌరీ సాథేను తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు స్టాక్ మార్కెట్లో ఎలాంటి ట్రేడింగ్ పెట్టుబడి కార్యకలాపాలు చేయకుండా నిషేధించింది సెబీ. తాజా చర్యలతో లైసెన్స్ లేకుండా ఆర్థిక సలహాలు ఇచ్చే వారిపై సెబీ కఠినంగా వ్యవహరిస్తుందనే సందేశాన్ని ఇచ్చింది మార్కెట్ రెగ్యులేటరీ సంస్థ సెబీ.