గోదావరిఖని, వెలుగు: పరుగుతోనే ఆరోగ్యం సాధ్యమవుతుందని రామగుండం మేయర్ మహాంకాళి స్వామి, ఏసీపీ ఎం.రమేశ్ అన్నారు. ఆదివారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖని సింగరేణి జవహర్‌లాల్‌నెహ్రూ స్టేడియంలో హైదరాబాద్‌కు చెందిన సొసైటీ ఫర్ తెలంగాణ రన్నర్స్ ఆధ్వర్యంలో అవంతిక తెలంగాణ ప్రోమో రన్–-2026 కార్యక్రమం నిర్వహించగా, సుమారు వెయ్యి మంది ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఆరోగ్యమే మహాభాగ్యం అనే సందేశంతో జరిగిన ఈ రన్ కార్యక్రమంలో ఎవరి సామర్థ్యానికి తగ్గట్టు వారు 2కే, 5కే, 10కే పరుగు పూర్తి చేసి తమ లక్ష్యాన్ని సాధించారు. జూన్ 7న హైదరాబాద్ నెక్లెస్ రోడ్‌లో జరిగే ఫైనల్ రన్‌ను అత్యంత ఘనంగా నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నామని, ఇందులో భాగంగా గోదావరిఖనిలో ప్రోమో రన్ నిర్వహించినట్టు నిర్వాహకులు తెలిపారు. ఏసీపీ రమేశ్ స్వయంగా 5కే రన్ పూర్తి చేసి ఆదర్శంగా నిలిచారు.
రన్నింగ్ అనేది కేవలం వ్యాయామం కాదు.. అది ఒక జీవనశైలి అని, ప్రతి ఒక్కరి దినచర్యలో పరుగు భాగం కావాలని సూచించారు. రన్ పూర్తి చేసిన వారికి మేయర్ మహంకాళి స్వామి మెడల్స్ అందజేసి అభినందించారు. కార్యక్రమంలో ఆర్జీ 2 ఏరియా ఎస్‌వో2 జీఎం రాముడు, సొసైటీ ఫర్ తెలంగాణ రన్నర్స్ అధ్యక్షుడు సోమా జగన్మోహన్ రెడ్డి, ఉపాధ్యక్షుడు డాక్టర్ మహేశ్, ట్రెజరరీ హరీశ్ చంద్రారెడ్డి, రవి, రాజు, సదాశయ ఫౌండేషన్ జాతీయ గౌరవ అధ్యక్షుడు రామకృష్ణా రెడ్డి, కార్యదర్శి లింగమూర్తి, ప్రతినిధులు పాల్గొన్నారు.

