దేశంలో ఫార్మల్ ఉద్యోగాల మార్కెట్ ఓ రేంజ్‌లో దూసుకుపోతోంది. ఈపీఎఫ్ సంస్థ తాజా లెక్కలు దేశంలో పెరుగుతున్న ఉపాధి అవకాశాలకు అద్దం పడుతున్నాయి. గత ఏడాది జూన్ నెలతో పోలిస్తే ఈసారి ఏకంగా 7.86 శాతం వృద్ధితో.. కొత్తగా 19.29 లక్షల మంది నెట్ మెంబర్లు ఈపీఎఫ్‌ఓ నెట్‌వర్క్‌లోకి చేరారు. ఇందులో అత్యంత క్రేజీ విషయం ఏంటంటే.. మొదటిసారి ఉద్యోగాల్లో చేరిన 18-25 ఏళ్ల లోపు యువత శాతమే ఏకంగా 59.14 శాతంగా ఉండటం. అంటే దేశంలో యువతకు పెద్ద ఎత్తున ఆర్గనైజ్డ్ సెక్టార్ లో అవకాశాలు దక్కుతున్నాయని స్పష్టమవుతోంది. కేవలం కొత్త వాళ్లే కాదు, గతంలో ఉద్యోగం మానేసి తాత్కాలికంగా బయటకు వెళ్లి, మళ్లీ తిరిగి ఈపీఎఫ్‌ఓలోకి రీ-ఎంట్రీ ఇచ్చిన వారి సంఖ్య కూడా 14.15 లక్షలుగా నమోదైంది. పీఎఫ్ ప్రయోజనాలపై కార్మికుల్లో పెరిగిన అవగాహనే కారణమని కేంద్ర కార్మిక శాఖ పేర్కొంది.
సభ్యుల సంఖ్య పెరగడమే కాదు.. ఈపీఎఫ్‌ఓ తన సేవలను కూడా అంతే స్పీడ్‌గా అప్‌గ్రేడ్ చేస్తోంది. గతంలో పేరు, పుట్టిన తేదీ, జెండర్, తలిదండ్రుల పేర్లు, జాయినింగ్ డేట్ వంటి పర్సనల్ డీటెయిల్స్ మార్చాలంటే పీఎఫ్ ఆఫీసుల చుట్టూ, పనిచేసిన ఓనర్ల చుట్టూ తిరగాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఆ తలనొప్పులన్నీ తీరిపోయాయి. యూనిఫైడ్ మెంబర్ పోర్టల్ ద్వారా ఇంటి నుంచే ఆన్‌లైన్‌లో వీటిని అప్‌డేట్ చేసుకోవచ్చు. పోర్టల్‌లోకి లాగిన్ అయి.. "Manage" సెక్షన్‌లోని "Modify Basic Details" ఆప్షన్ ద్వారా వివరాలను సరిదిద్దుకోవటమే కాకుండా, వాటి స్టేటస్‌ను కూడా ట్రాక్ చేసుకోవచ్చు.
ఇ-నామినేషన్ చేయకపోతే ప్రమాదమే..
ఇక అన్నింటికంటే ముఖ్యమైనది ఆన్‌లైన్ ఇ-నామినేషన్ ప్రక్రియ. పీఎఫ్ ఖాతాదారులు తమ కుటుంబ సభ్యులను నామినీగా చేర్చడాన్ని ఈపీఎఫ్‌ఓ మరింత సులభతరం చేసింది. పోర్టల్‌లోని "E-Nomination" సెక్షన్‌లోకి వెళ్లి నామినీ వివరాలు, పుట్టిన తేదీ, ఫోటోలను అప్‌లోడ్ చేయవచ్చు. అయితే ఇక్కడే ఒక ముఖ్యమైన రూల్ ఉంది. వివరాలన్నీ ఎంటర్ చేశాక.. ఆధార్ లింక్డ్ ఓటీపీ ద్వారా ఈ-సైన్ వెరిఫికేషన్ పూర్తి చేయడం తప్పనిసరి.
ఈ ఫైనల్ స్టెప్ పూర్తి చేయకపోతే నామినేషన్ చెల్లుబాటు కాదు. ఒకవేళ దురదృష్టవశాత్తూ సభ్యుడు మరణిస్తే.. నామినేషన్ సరిగ్గా లేకపోవడం వల్ల పీఎఫ్ బ్యాలెన్స్, పెన్షన్, ఉద్యోగుల డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లు సకాలంలో అందక కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కాబట్టి UAN యాక్టివేట్ చేసుకుని, ఆధార్ లింకేజ్ పూర్తి చేసి, రికార్డులను పక్కాగా ఉంచుకోవడం ఎంతో అవసరం.
