శ్రీరామచంద్రుడికి సూర్య తిలకం... - దర్శనభాగ్యం ఎప్పుడంటే..

 శ్రీరామచంద్రుడికి సూర్య తిలకం... - దర్శనభాగ్యం ఎప్పుడంటే..

 

అయోధ్య రామాలయ నిర్మాణంలో అణువణువునా ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ఇందులో ఒకటి గర్భగుడిలో కొలువుతీరిన రాముడికి సూర్యతిలకాన్ని ఎప్పుడు దిద్దుతారు .. అయోధ్యలో కొలువైన బాలరాముడి సూర్య తిలకంతో ఎప్పుడు దర్శనమిస్తాడు..  సూర్య తిలకం ప్రక్రియ ఎంత సమయం కొనసాగుతుంది.. అయోధ్య గర్భాలయంలోకి సూర్య కిరణాలు ఎలా వస్తాయి.. మొదలైన విషయాలను తెలుసుకుందాం. . . 

 వెయ్యేళ్లకుపైగా చెక్కుచెదరకుండా ఉండేలా, శక్తివంతమైన భూకంపాలను సైతం తట్టుకునేలా అయోధ్య ఆలయాన్ని నిర్మించారు. అడుగుతో ప్రత్యేకత ఉన్న అయోధ్య ఆలయంలో..గర్భగుడిలో ఉన్న శ్రీరాముడి విగ్రహం నుదిటిపై సూర్య కిరణాలు ప్రసరించేలా ప్రత్యేక వ్యవస్థ  ఏర్పాటు చేశారు. 

6 నిముషాల పాటూ సూర్య తిలకం

ప్రతి సవంత్సరం శ్రీరామనవమి రోజు మధ్యాహ్నం 12 గంటలకు మొదలు కానున్న ఈ ప్రక్రియ 6 నిమిషాల పాటు కొనసాగనుంది. ఈ 6 నిమిషాల పాటు గర్భగుడిలోని శ్రీరాముడి విగ్రహ నుదుటిపై సూర్య కిరణాలు ప్రసరించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 

ఈ శ్రీరామనవమికి సాధ్యం కాదు

ఏటా శ్రీరామనవమికి అన్నారు కదా అని..ఈ శ్రీరామనవమికి శ్రీరాముడి నుదిటిన సూర్యతిలకం చూడొచ్చు అనుకుంటే నిరాశపడాల్సిందే. ఎందుకంటే ప్రస్తుతానికి ఆలయం పూర్తిగా నిర్మాణం జరగలేదు. మొత్తం మూడు అంతస్థులు పూర్తి అయిన తర్వాతే ఇది అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. సూర్య కిరణాలు మూడో అంతస్తుపై నుంచి పడాల్సి ఉన్నందున.. ఆలయ నిర్మాణం 3 అంతస్థులు పూర్తైన తర్వాతే దీన్ని ఆవిష్కరించడం సాధ్యమవుతుంది. అయోధ్య రామ మందిరంలో ప్రస్తుతం గ్రౌండ్ ఫ్లోర్ పనులు మాత్రమే పూర్తి కాగా.. 2025 డిసెంబర్ నాటికి మొత్తం 3 అంతస్థులు పూర్తి అవుతాయని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ వెల్లడించింది. అంటే రెండేళ్లతర్వాత మాత్రమే శ్రీరాముడి నుదిటిన సూర్యతిలకం దర్శించుకునే భాగ్యం భక్తులకు కలగనుంది. 

ప్రత్యేక టెక్నాలజీ

సూర్యుడి కిరణాలు రాముడి నుదిటిపై ప్రసరించేలా ప్రత్యేకంగా కటకాలు, అద్దాలు, గేర్‌బాక్స్‌లు, గొట్టాలను  ఏర్పాటు చేశారు. ఈ ప్రత్యేక టెక్నాలజీని సీఎస్‌ఐఆర్‌ ఆధ్వర్యంలో పనిచేస్తున్న సెంట్రల్‌ బిల్డింగ్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ -సీబీఆర్ఐ రూపొందించింది. దాని కోసం ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆస్ట్రోఫిజిక్స్‌-ఐఐఏ సహాయం తీసుకుంది. ఇక దీనికి కావాల్సిన వస్తువులను బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఆప్టిక్స్‌ సంస్థ తయారు చేసి ఇచ్చింది.  మూడో అంతస్తు నుంచి సూర్యకిరణాలు గర్భగుడిలోని విగ్రహం వరకు ప్రసరించేలా ఈ పరికరాలను అమర్చారు. ఈ సూర్యతిలకం కోసం ఏర్పాటు చేస్తున్న ప్రత్యేక వ్యవస్థలోనూ ఎలాంటి ఉక్కు, ఇనుము, బ్యాటరీలు, విద్యుత్తు వాడలేదని సీబీఆర్‌ఐ స్పష్టం చేసింది.