ఆదిలాబాద్లో ఘనంగా అయోధ్య అక్షింతల శోభాయాత్ర

ఆదిలాబాద్లో ఘనంగా అయోధ్య అక్షింతల శోభాయాత్ర

ఆసిఫాబాద్/మంచిర్యాల, వెలుగు: అయోధ్య పూజిత అక్షింతల శోభాయాత్రను ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఆదివారం అంగరంగ వైభవంగా జరిపారు. ఆరడుగుల శ్రీరాముని విగ్రహంతో పాటు అక్షింతలను ఊరేగింపుగా తీసుకెళ్లారు. నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ శోభాయాత్ర జిల్లా కేంద్రంలోని జనకాపూర్ రామాలయంలో ప్రారంభమై ప్రధాన రహదారి గుండా చెక్ పోస్ట్ వరకు చేరి, అక్కడి నుంచి పట్టణంలోని వీధుల గుండా రామాలయానికి చేరుకుంది. 

ఈ యాత్రలో మహిళలు భారీగా పాల్గొన్నారు. భక్తుల శ్రీరామ నామస్మరణతో వీధులు మారుమోగాయి. ఎమ్మెల్యే కోవ లక్ష్మి జెండా ఊపి ఈ శోభాయాత్రను ప్రారంభించి అందులో పాల్గొన్నారు. ఎంపీపీ మల్లికార్జున్, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ చార్జ్ శ్యాం నాయక్, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు విశాల్, రాష్ట్ర నాయకుడు సతీశ్ బాబు ప్రత్యేక పూజలు నిర్వహించి అక్షింతలు తలపై పెట్టుకుని ఆలయ ప్రదక్షిణలు చేశారు. శ్రీరాముడి అక్షింతల శోభాయాత్ర మంచిర్యాలలో ఘనంగా జరిగింది. 

స్థానిక అశోక్ రోడ్, వసంత టాకీస్ ఏరియా, సీతారామ కాలనీ, బృందావన కాలనీ, సెవెన్ హిల్స్ కాలనీ, కైలాసగిరి కాలనీ, తిరుమలగిరి కాలనీతోపాటు పలు ప్రాంతాల్లో శోభాయాత్ర నిర్వహించారు. సోమవారం ఉదయం అక్షింతల వితరణ చేస్తామని నిర్వాహకులు తెలిపారు. శోభాయాత్రలో అయోధ్య శ్రీరామతీర్థ ట్రస్ట్ బస్తీ సంయోజక్ తోట సదానందం, సహ సంయోజక్ కుంచాల శంకరయ్య, జిల్లా రామతీర్థ ట్రస్టు సభ్యులు రాజు యాదవ్, వీహెచ్​పీ జిల్లా కార్యదర్శి వేముల రమేశ్, ఆర్ఎస్ఎస్ నగర కార్యవహకులు పర్వతాలు, నరసయ్య, జిల్లా ప్రతినిధి రవిశంకర్ పాల్గొన్నారు.