ముస్లిం దేశం నుంచి అయోధ్యకుస్పెషల్ గిఫ్ట్.. ఏంటంటే...

ముస్లిం దేశం నుంచి అయోధ్యకుస్పెషల్ గిఫ్ట్.. ఏంటంటే...

అయోధ్య రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి సమయం దగ్గర పడుతున్న తరుణంలో... రామ మందిరానికి కానుకలు వెల్లువెత్తుతున్నాయి. కరుడుగట్టిన ముస్లిం ఛాందసవాద దేశం ఆఫ్ఘనిస్థాన్ నుంచి కూడా అయోధ్యకు ఒక ప్రత్యేకమైన కానుకను పంపించారు. ఈ విషయాన్ని విశ్వహిందూ పరిషత్ ప్రెసిడెంట్ అలోక్ కుమార్ వెల్లడించారు. ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్ లో ప్రవహించే కుబా నదిలోని నీటిని పంపించారని... ఆ నీటిని కానుకగా స్వీకరించామని తెలిపారు. శ్రీరాముడి అభిషేకం కోసం ఈ నీటిని పంపించారని చెప్పారు. 

కశ్మీర్ నుంచి కూడా ప్రత్యేక కానుక వచ్చిందని అలోక్ కుమార్ చెప్పారు. కశ్మీర్ కు చెందిన ముస్లిం సోదరులు, సోదరీమణులు తనను కలిశారని... రామ మందిర నిర్మాణంపై ఆనందం వ్యక్తం చేశారని తెలిపారు. సేంద్రీయ పద్ధతిలో పండించిన రెండు కిలోల స్వచ్ఛమైన కుంకుమను అందజేశారని అలోక్ కుమార్ చెప్పారు. మన మతాలు వేరైనా... మన పూర్వీకులు ఒకరేనని వారు అన్నారని తెలిపారు. తాము అత్యంత ఎక్కువ అభిమానించే పూర్వీకుల్లో రాముడు ఒకరని కశ్మీర్ నుంచి వచ్చిన వారు తనతో అన్నారని చెప్పారు.  

Also Read : అయోధ్య రామయ్యకు కానుకల వెల్లువ.. ఇప్పటి వరకు వచ్చినవి ఇవే...

తమిళనాడుకు చెందిన చేనేత కార్మికులు ప్రత్యేకంగా తయారు చేసిన పట్టు వస్త్రాలను రామ మందిరానికి పంపించారని తెలిపారు. నేపాల్ నుంచి కూడా కానుకలు వచ్చాయని చెప్పారు. ఈ కానుకలన్నింటినీ తాను రామ జన్మభూమి ట్రస్ట్ కు అందజేస్తానని చెప్పారు. రాముడి కోసం కుల, మత, ప్రాంతాలకు అతీతంగా కానుకలు వస్తుండటం సంతోషంగా ఉందని చెప్పారు. రాముడికి సేవ చేయడం తనకు ఎంతో ఆనందాన్ని ఇస్తుందని అన్నారు. రాముడి పూజలో తాను కూడా కూర్చుంటానని అలోక్ కుమార్ చెప్పారు.