అయోధ్య గర్భగుళ్లో యాగాలు ..యజ్ఞాలు

అయోధ్య గర్భగుళ్లో యాగాలు ..యజ్ఞాలు

అయోధ్యలో జనవరి 22న శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠాపన కార్యక్రమం జరగనుంది. అందుకు ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా రామాలయ ప్రారంభోత్సవాన్ని నిర్వహించనున్నారు.ఇప్పటికే రాంలల్లా అయోధ్య రామాలయంలోకి  ప్రవేశించారు.  గర్భగుడిని వేదమంత్రాలతో పుణ్యవచనం ద్వారా  శుద్ది చేసిన తర్వాత..  గర్భగుడిలోకి ప్రవేశించాడు. ఆలయ ప్రాంగణంలో యాగాలు, యజ్ఞాలను నిర్వహిస్తున్నారు.

అయోధ్యలో  శ్రీరాముడి  ప్రాణప్రతిష్ఠ కోసం కోట్లాది హిందువులు ఎదురుచూస్తున్నారు. ఆ మహా ఘట్టానికి  కనులారా వీక్షించేందుకు ఎంతో మంది తరలివెళ్తున్నారు. అక్కడికి వెళ్లలేని వారు టీవీల్లో వీక్షించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.అయోధ్య రామమందిరంలో బాలరాముడి విగ్రహం కొలువుదీరనంది. ఆ విగ్రహం ఎత్తు 51 అంగుళాలు. అంటే దాదాపు 4 అడుగులు ఉంటుంది. చేతిలో ధనస్సు, వీపులో అమ్ముల పొదిని ధరించి..కమలం పువ్వు నిలబడిపై ఉంటాడు.

ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ఆహ్వాన పత్రికలపై ఈ బాలరాముడి రూపాన్ని ముద్రించారు. మైసూరు శిల్పి అరుణ్‌ యోగిరాజ్‌ చెక్కిన విగ్రహాన్ని ఎంపిక చేశారు. ఐదేళ్ల వయసున్న బాలరాముడు నిలబడి ఉన్న రూపంలో విగ్రహం ఉంటుందని మాత్రమే ట్రస్ట్ తెలిపింది.ఇక రామజన్మభూమిలో మొత్తం 70 ఎకరాల్లో శ్రీరాముడి ఆలయ కాంప్లెక్స్‌ ఉంటుంది. అందులో 70శాతం పచ్చదనంతో నిండి ఉంటుంది. భక్తులు తూర్పు దిక్కు నుంచి ఆలయంలోకి ప్రవేశించి దక్షిణ దిక్కు నుంచి బయటకు వస్తారు.

భక్తులు ఆలయంలోకి వెళ్లాలంటే మొత్తం 32 మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. జీ+2 పద్ధతిలో ప్రతి ఫ్లోర్‌ 20 అడుగుల ఎత్తులో ఉంటుంది. ప్రతి అంతస్తులో 392 చొప్పున స్తంభాలు, 44 ప్రవేశమార్గాలు ఉంటాయి. ఆలయం చుట్టూ 14 అడుగుల వెడల్పున, 732 మీటర్ల వైశాల్యంతో కైవారం నిర్మించారు. సూర్యుడిని తలపించేలా 30 అడుగుల ఎత్తున నిర్మించిన 40 స్తంభాలు అయోధ్య నగరంలో రాత్రిపూట ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.