శ్రీరామా ... అయోధ్యలో ఏమిటీ రేట్లు...

శ్రీరామా ...  అయోధ్యలో ఏమిటీ రేట్లు...

పండుగ వస్తే చాలు కొబ్బరికాయలు.. అరటిపండ్లు..తమలపాకుల ధరలు కొండెక్కుతాయి.  ఇక జాతరలైనా.. ఉత్సవాలైతే ఆ ప్రాంతంలో ఏది కొనాలన్నా జేబులు ఖాళీ అవ్వాల్సిందే.  అయోధ్యలో ఈ నెల 22న మహా జాతర జరుగబోతోంది.  ఈ కార్యక్రమానికి అక్కడకు వెళ్లి ఉంటాలంటే హోటల్​ రూమ్స్​ ధరలు ఠారెత్తిస్తున్నాయి.   అయోధ్యలో శ్రీరాముడి విగ్రహం ప్రతిష్ఠ వేళ .. అక్కడ అద్దె గదుల రేట్లు 10 రెట్ల కంటె ఎక్కువుగా పెంచేశారు హోటళ్ల యజమానులు. 

ఉత్తరప్రదేశ్‌ అయోధ్య గర్భగుడిలో రాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ  కార్యక్రమం కోసం కోట్ల మంది ఎదురుచూస్తున్నారు. మరికొంతమంది స్వయంగా వీక్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో అయోధ్యలో  హోటళ్ల బుకింగ్స్‌ ఇప్పటికే సుమారు 80 శాతం మేరకు పూర్తయ్యాయి. ఈ సమయంలో ఈ కార్యక్రమాన్ని హోటళ్ల యజమానులు ఫుల్ గా క్యాష్ చేసుకుంటున్నారు.

అయోధ్యలో ఈ నెల 22న జరిగే  శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ‍భక్తులు  అక్కడికి వెళ్లేందుకు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. ఆ రోజున దేశ విదేశాలనుంచి సుమారు ఐదు లక్షల మంది వరకూ భక్తులు అయోధ్యకు వస్తారనే అంచనాలున్నాయి.  అయోధ్యలోని హోటల్ రూం బుకింగ్ ధరలు గతంలో కంటే సుమారు ఐదు నుంచి 10 రెట్లు పెరిగినట్లు తెలుస్తుంది. 

 ఇందులో భాగంగా... కొన్ని హోటల్ యజమానులు రూముల  ధరను ఒక్కసారిగా ఊహించని స్థాయిలో పెంచేశారు. నార్మల్ హోటల్ నుంచి లగ్జరీ హోటల్ వరకూ ఈ విషయంలో తగ్గేదేలే అన్నట్లుగా టారిఫ్ లు పెంచేశారు.  హోటల్ అయోధ్య ప్యాలెస్‌ లో  గది అద్దె రూ.3,700 ఉండగా... ఇప్పుడు సుమారు రూ.18,500 పలుకుతోంది. ఇదే సమయంలో ది రామాయణ హోటల్‌ లో రోజువారీ గది అద్దె 2023లో రూ.14,900గా ఉండగా... అదికాస్తా రూ. 40 వేలకు పెరిగినట్లు చెబుతున్నారు. ఇక  సిగ్నెట్ కలెక్షన్ హోటల్‌ లో రూం అద్దె రూ. 16,800 నుంచి సుమారు రూ.70,500కు పెరిగినట్లు చెబుతున్నారు. దీంతో ఈ అద్దె గదులు భక్తులకు గట్టి షాక్ ఇస్తున్నాయని అంటున్నారు. 

ప్రస్తుతానికి అందుతున్న సమాచారం ప్రకారం... ఈ హోటళ్లలోని గదులు జనవరి 20 నుండి 23 వరకు ఇప్పటికే బుక్ అవ్వగా... వాటిలోని గది అద్దె రోజుకు రూ.10 వేల నుంచి రూ.25 వేల వరకూ పెరిగిందని తెలుస్తోంది. అయితే ఈ లెక్క రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం కూడా కనిపిస్తోంది. అయోధ్యలో అద్దె గదుల ధరలను తగ్గించేందుకు యూపీ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.