నింగ్బో (చైనా): ఇండియా యంగ్ షట్లర్ ఆయుష్ షెట్టి.. బ్యాడ్మింటన్ ఆసియా చాంపియన్‌షిప్‌లో క్వార్టర్‌ఫైనల్లోకి ప్రవేశించాడు. గురువారం జరిగిన మెన్స్ సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో ఆయుష్ 21–16, 21–12తో చి యు జెన్ (చైనీస్ తైపీ)పై గెలిచాడు. 41 నిమిషాల మ్యాచ్‌లో ఇండియన్ ప్లేయర్ కీలక టైమ్‌లో అద్భుతంగా పోరాడాడు. తొలి గేమ్‌లో 4–4తో స్కోరు సమమైన తర్వాత జెన్ 10–6తో ముందంజ వేశాడు. కానీ వెంటనే తేరుకున్న ఆయుష్ వరుస పాయింట్లతో 12–12, 18–14తో దూసుకుపోయాడు.
4–0 ఆధిక్యంతో రెండో గేమ్ మొదలుపెట్టిన ఇండియన్ షట్లర్ క్రమంగా లీడ్‌ను 11–7, 16–9కు పెంచుకున్నాడు. జెన్ నుంచి ప్రతిఘటన లేకపోవడంతో ఈజీగా గేమ్, మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. మరో మ్యాచ్‌లో హెచ్.ఎస్. ప్రణయ్ 12–21, 19–21తో వెంగ్ హాంగ్ యంగ్ (చైనా) చేతిలో ఓడాడు. విమెన్స్ సింగిల్స్‌లో పీవీ సింధు 18–21, 8–21తో రెండోసీడ్ వాంగ్ జి యి (చైనా) చేతిలో, ఉన్నతి హుడా 17–21, 9–21తో టొమోకా మియజాకీ (జపాన్) చేతిలో కంగుతిన్నారు. విమెన్స్ డబుల్స్‌లో ప్రియ–శ్రుతి మిశ్రా 10–21, 13–21తో యుకీ ఫుక్‌షిమా–మయు మట్సుమోటో (జపాన్) చేతిలో, మిక్స్‌డ్ డబుల్స్‌లో ధ్రువ్ కపిల–తనీషా క్రాస్టో 13–21, 14–21తో చెన్ టాంగ్ జి–తోహ్ ఈ వీ (మలేసియా) చేతిలో ఓడారు.
