
భారీ వర్షానికి హైదరాబాద్ నాగోల్ ప్రాంతంలోని అయ్యప్పనగర్ కాలనీ నీటమునిగింది. దీంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్లలోకి వరద చేరడంతో ఇళ్లకు తాళాలు వేసి వెళ్లిపోతున్నారు. కాలనీలో సుమారు 50 ఇళ్లకు తాళం పడింది. బాక్స్ డ్రైన్ నిర్మించిన సమయంలో కాలనీలోని వరద నీరు బయటకు వెళ్ళే మార్గం మూసుకుపోయింది. దీంతో వరద నీరు కాలనీలో ఎక్కడికక్కడ నిలిచిపోయింది. అయినా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. నీటిని తొలగించేందుకు మోటార్ పెట్టారని..అయితే అది 25నిమిషాలు మాత్రమే పనిచేసిందన్నారు. అధికారులు తమ కాలనీవైపు కనీసం కన్నెత్తి చూడడం లేదని..ఇప్పటికైన స్పందించి వరద నీటిని తొలగించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. కాగా గత నాలుగైదు రోజలుగా రాష్ట్రంలో ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమవగా..ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.