ఆజాద్ కొత్త పార్టీ.. రెండు వారాల్లో ప్రకటన

ఆజాద్ కొత్త పార్టీ.. రెండు వారాల్లో ప్రకటన

జమ్మూ : కాంగ్రెస్ ను వీడిన సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ త్వరలోనే కొత్త పార్టీ పెట్టనున్నారు. ఆజాద్ కొత్త పార్టీ పెడతారని, దీనిపై రెండు వారాల్లో ప్రకటన చేస్తారని ఆయన అనుచరుడు జీఎం సరూరీ చెప్పారు. ముందుగా జమ్మూకాశ్మీర్ లో పార్టీ పెడతారని, ఆ తర్వాత జాతీయ స్థాయి పార్టీపై ఆలోచన చేస్తారని తెలిపారు. శనివారం జమ్మూలో సరూరీ మీడియాతో మాట్లాడారు. సెప్టెంబర్ 4న ఆజాద్ జమ్మూకు వస్తారని, కొత్త పార్టీ ఏర్పాటుపై మద్దతుదారులతో చర్చిస్తారని ఆయన చెప్పారు. ఆజాద్ ది సెక్యులర్ భావజాలమని, ఆయన ఎట్టిపరిస్థితుల్లోనూ బీజేపీతో కలిసి పని చేయరని తెలిపారు. ఆజాద్ కాంగ్రెస్ ను వీడడంతో ఏం చేయాలో అర్థంకాక, ఆయనపై ఆ పార్టీ నేతలు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ‘‘ఆజాద్ జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రిగా పని చేశారు. ఆయన పాలనాకాలం స్వర్ణయుగం లాంటిది. ఇప్పుడాయన తిరిగి జమ్మూకాశ్మీర్ కు రావడం ఆనందంగా ఉంది” అని పేర్కొన్నారు. జమ్మూకాశ్మీర్ ను తిరిగి ఒక్కటి చేసి, ప్రత్యేక హోదా ఇవ్వాలనే అంశాన్ని తమ పార్టీ మేనిఫెస్టోలో పెడతామని వెల్లడించారు.  

కాంగ్రెస్ ఖతం.. 
జమ్మూకాశ్మీర్ లో కాంగ్రెస్ పనైపోయిందని సరూరీ అన్నారు. ఇప్పటికే ఆజాద్ కు మద్దతుగా మాజీ మంత్రులు, సీనియర్ నేతలు, కార్యకర్తలు వందలాది మంది కాంగ్రెస్ కు రాజీనామా చేశారని చెప్పారు. ఇంకొంత మంది ఆ పార్టీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. కాగా మాజీ మంత్రి,  కాంగ్రెస్ జమ్మూకాశ్మీర్ మాజీ వైస్ ప్రెసిడెంట్ అయిన సరూరీ.. ఆజాద్ కు మద్దతుగా ఆ పార్టీకి రాజీనామా చేశారు.