జూమ్ మీటింగ్ మధ్యలో అసభ్య ప్రవర్తన.. 

జూమ్ మీటింగ్ మధ్యలో అసభ్య ప్రవర్తన.. 
  • అసలు ట్విస్ట్ ఆలస్యంగా బయటపడింది

అజర్ బైజాన్:  ‘‘జూమ్ మీటింగ్ జరుగుతోంది.. లైవ్లో ఉన్న సంగతి మర్చిపోయి ఓ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన అజర్ బైజాన్ ప్రధాని అలీ అసదోవ్’’.. ఇలాంటి టైటిల్స్ తో ఓ వీడియో ఈమధ్య సోషల్ మాడియాలో వైరల్ అయ్యింది. అంతర్జాతీయ పత్రికలు, ఇంటర్నేషనల్ వెబ్సైట్స్, టాబ్లాయిడ్స్ ప్రధాని అసదోవ్ తీరును తప్పుబడుతూ ఆ వార్తను ప్రచురించేశాయి. సోషల్ మీడియాలో చాలా వేగం. ఇలాంటి విషయాల్లో ఊహించనంత వేగంగా ప్రపంచం నలుమూలలకు వెళ్లిపోతుంది. అయితే ఈ వీడియోకు సంబంధించి ఎవరూ ఊహించని ట్విస్ట్ కొన్ని రోజుల తర్వాత ఆలస్యంగా ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. అందులో ఉన్నది ఆయన కాదని తేలడంతో అందరూ నాలుక్కరచుకాల్సి వచ్చింది. తొండరపడిన మీడియా సంగతి సరేసరి. 
అసలు విషయం వెలుగులోకి రావడంతో  అజర్ బైజాన్ ప్రధాని అలీ అసదోవ్ తీవ్రంగా స్పందించారు. నన్ను తలవంచుకునేలా చేశారంటూ కారాలు మీరాలు నూరుతున్నాడు. వాస్తవాలు తెలుసుకోకుండా.. తన మాటలు పట్టించుకోకుండా ఏకపక్షంగా కథనాలు ప్రచురించిన, ప్రసారం చేసిన మీడియా, వెబ్సైట్లపై చర్యలకు అజర్ బైజాన్ ప్రధాని అలీ అసదోవ్ సిద్ధమవుతుండడంతో వ్యవహారం రసకందాయంలో పడింది. 
అసలేం జరిగింది.. ఇంతకూ ఆ వీడియోలో ఉన్నదెవరంటే
జూమ్ మీటింగ్ జరుగుతుండగా.. అందులో ఉన్న ఓ  పెద్దాయన సడన్గా పక్కకు జరిగి వెనక్కి తిరుగుతాడు. అక్కడే ఓ మహిళ ఫైళ్లు తీసుకుంటూ ఉండగా.. ఆమెను వెనుక భాగాన్ని తన చేత్తో అసభ్యంగా తాకుతాడు. ఊహించని చర్యతో ఉలిక్కి పడ్డ ఆ మహిళ.. ఆయనతో వాగ్వాదానికి దిగుతుంది.. వెంటనే అక్కడి నుంచి వెళ్లపోతుంది. ఆలస్యంగా కెమెరా ఆన్లో నే ఉన్న విషయం గుర్తించిన ఆయన  వెంటనే కెమెరా ఆఫ్ చేస్తాడు. ఇది కాస్తా వెంటనే సోషల్ మీడియాకు చేరడంతో వైరల్ అయింది. కొందరు నెటిజనులు అజర్ బైజాన్ అధ్యక్షుడి పనే అని, కాదు ప్రధాని అలీ అసదోవ్ పనే అని మరికొందరు ఎవరికి తోచినట్లు వారు ప్రచారం చేశారు. జూమ్ మీటింగ్కు అయిపోయిన తర్వాత కెమెరా ఆఫ్ చేయడం మరిచి.. అలా ప్రవర్తించారని కామెంట్స్ చేశారు. అయితే అందులో ఉంది అజర్ బైజాన్ అధ్యక్షుడో, ప్రధానో కాదని ఇప్పుడు తేలింది.
అసభ్యంగా ప్రవర్తించింది మాజీ ఎంపీ హుసేయిన్బలా మిరాలమోవ్
జూమ్ మీటింగ్ జరుగుతుండగా లైవ్ లో మహిళతో అసభ్యంగా ప్రవర్తించింది అజర్ బైజాన్ దేశాధ్యక్షుడు కాదు.. ప్రధాని కాదు.. అదే దేశానికి చెందిన మాజీ ఎంపీ, యూనివర్సిటీ ప్రొఫెసర్ హుసేయిన్బలా మిరాలమోవ్ అని వెలుగులోకి వచ్చింది. గత నెలలో ఆయన ఈ పాడు పని చేసి మూల్యం చెల్లించుకున్నాడు. అంతేకాదు ఈ వీడియో రిలీజ్ అయ్యి నెల రోజులపైనే అయితోందట.  ఈ ఘటన తర్వాత ఆయనపై విమర్శలు వెల్లువెత్తడంతో తన ఎంపీ పదవికి రాజీనామా చేశాడు. న్యూ అజర్ బైజాన్ పార్టీ కూడా ఆయనపై బహిష్కరణ వేటు వేసిందట. ఈ వ్యవహారాలన్నీ అధికారిక జూమ్ మీటింగ్లోనే జరిగాయట. 
పోలికలు గుర్తించకుండా.. పట్టించుకోకుండా సోషల్ మీడియాలో వీడియోను వైరల్ చేయడం.. దాని ఆధారంగా వాస్తవాలు నిర్ధారించుకోకుండా కథనాలు ప్రచురించిన మీడియా, వెబ్సైట్లపై చర్యలకు అజర్ బైజాన్ ప్రధాని సిద్ధపడుతున్నట్లు సమాచారం.