తొలి రోజు 60 మంది కాంగ్రెస్​ అభ్యర్థులకు బీఫారాలు

తొలి రోజు  60 మంది  కాంగ్రెస్​ అభ్యర్థులకు బీఫారాలు

హైదరాబాద్​, వెలుగు: నామినేషన్ల ప్రక్రియ స్టార్ట్​ కావడంతో కాంగ్రెస్​ పార్టీ తమ అభ్యర్థులకు బీఫారాల పంపిణీని మొదలుపెట్టింది. ఆదివారం గాంధీభవన్​లో ఏఐసీసీ ఇన్​చార్జ్​ కార్యదర్శులు పీసీ విశ్వనాథ్​, రోహిత్​ చౌదరి, పీసీసీ వర్కింగ్​ ప్రెసిడెంట్​ మహేశ్​ కుమార్​ గౌడ్ 60 మంది క్యాండిడేట్లకు బీ ఫారాలను అందజేశారు. ఇప్పటివరకు రెండు విడతల్లో వంద మంది అభ్యర్థులను ప్రకటించగా.. మరో 19 మందిని ఖరారు చేయాల్సి ఉంది. 

37 మంది సోమవారం బీఫారాలు తీసుకునే అవకాశం ఉంది. పీసీసీ చీఫ్​ రేవంత్​ రెడ్డికి ఆదివారం ఉదయం బీఫారాన్ని అందజేశారు. జగిత్యాల బరిలో నిలిచిన జీవన్​రెడ్డి తరఫున ఆయన కుమారుడు బీఫారం తీసుకున్నారు. నిర్మల్​ అభ్యర్థి శ్రీహరి రావు తరఫున ఆయన కూతురు, కుత్బుల్లాపూర్​ అభ్యర్థి కొలను హన్మంత్​ రెడ్డి తరఫున ఆయన కూతురు, కుమారుడు బీఫారాలను అందుకున్నారు. 

కల్వకుర్తి అభ్యర్థి కసిరెడ్డి నారాయణ రెడ్డి, కంటోన్మెంట్​ అభ్యర్థి గద్దర్​ కూతురు వెన్నెల, జూబ్లీహిల్స్​ అభ్యర్థి అజారుద్దీన్​, గోషామహల్​ అభ్యర్థి సునీతారావు, పాలకుర్తి అభ్యర్థి యశశ్విని, సికింద్రాబాద్​ అభ్యర్థి ఆడెం సంతోష్​, చాంద్రాయణగుట్ట అభ్యర్థి బోయ నగేశ్​ తదితరులు గాంధీభవన్​లో బీఫారాలు తీసుకున్న వారిలో ఉన్నారు. కాగా, ఇప్పటిదాకా ప్రకటించిన వంద స్థానాల్లో మూడు స్థానాలకు అభ్యర్థులను మార్చే అవకాశం ఉన్నట్టు తెలిసింది.