బాబోయ్ ఎండలు : అన్ని జిల్లాల్లోనూ 40 డిగ్రీలు దాటింది

బాబోయ్ ఎండలు : అన్ని జిల్లాల్లోనూ 40 డిగ్రీలు దాటింది
  •  అత్యధికంగా నిర్మల్​ జిల్లాలో 43.1 డిగ్రీలు
  • 13 జిల్లాల్లో 42 డిగ్రీలకుపైగానే టెంపరేచర్లు
  • 21 జిల్లాలకు ఆరెంజ్​ అలర్ట్​ జారీ

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్రంలో ఎండలు దంచి కొడుతున్నాయి. ఈ సీజన్ లో తొలిసారిగా అన్ని జిల్లాల్లోనూ టెంపరేచర్లు 40 డిగ్రీలకు పైగా నమోదయ్యాయి. గురువారం అత్యధికంగా నిర్మల్​ జిల్లాలో 43.1 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఒక జిల్లాలో 43 డిగ్రీలు, 13 జిల్లాల్లో 42, 12 జిల్లాల్లో 41, 7 జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా టెంపరేచర్లు నమోదయ్యాయి. అన్ని జిల్లాల్లోనూ గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల మార్క్​ను దాటేశాయి. మరో నాలుగు రోజుల పాటు ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మరో మూడు డిగ్రీల వరకు టెంపరేచర్లు పెరిగే ప్రమాదముందని పేర్కొంది. శనివారం 21 జిల్లాలకు ఆరెంజ్​ అలర్ట్​ జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే ఈ నెలాఖరు నాటికే టెంపరేచర్లు 45 డిగ్రీల మార్క్​ను అందుకోవచ్చని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. 

42కిపైగా టెంపరేచర్లు నమోదైన జిల్లాలివే

నిర్మల్​ జిల్లాలోని దస్తూరాబాద్​లో అత్యధికంగా 43.1 డిగ్రీల టెంపరేచర్​ నమోదైంది. ఆ తర్వాత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతా నగర్​లో 42.9, కుమ్రంభీం ఆసిఫాబాద్​లో 42.5, నల్గొండ జిల్లాలో 42.4, ఆదిలాబాద్, మహబూబ్​నగర్​లో 42.3 చొప్పున, వనపర్తిలో 42.2, మంచిర్యాల, సూర్యాపేట, జగిత్యాల, మేడ్చల్​ మల్కాజిగిరి జిల్లాల్లో 42.1 చొప్పున, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, జోగుళాంబ గద్వాలలో 42 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక కామారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో 41.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నాగర్​కర్నూల్​, యాదాద్రిలో 41.8, ములుగు, ఖమ్మం, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో 41.7, కరీంనగర్​లో 41.4, మెదక్​లో 41.3, హనుమకొండలో 41.2, మహబూబాబాద్​లలో 41.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే సంగారెడ్డి జిల్లాలో 40.6 డిగ్రీలు, వికారాబాద్​లో 40.5, జనగామలో 40.4, పెద్దపల్లి, జయశంకర్​ భూపాలపల్లి, నారాయణపేటలో 40.3 చొప్పున, వరంగల్​ జిల్లాలో 40 డిగ్రీల టెంపరేచర్లు నమోదయ్యాయి.