బీజేపీ ఓడిపోతే మళ్లీ.. బాబ్రీ మసీదు డిమాండొస్తది

బీజేపీ ఓడిపోతే మళ్లీ.. బాబ్రీ మసీదు డిమాండొస్తది
  • బీఆర్ఎస్ కు ఓటేస్తే మురికి కాల్వలో వేసినట్లే: బండి సంజయ్

ఆదిలాబాద్/నిర్మల్/నేరడిగొండ/ఇచ్చోడ, వెలుగు :  వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతే మళ్లీ బాబ్రీ మసీదు డిమాండ్ వస్తుందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ అన్నారు. రామ మందిరం కావాలో, బాబ్రీ మసీదు కావాలో ప్రజలే తేల్చుకోవాలన్నారు. బుధవారం నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల్లో బీజేపీ విజయ సంకల్ప యాత్ర సందర్భంగా సంజయ్ మాట్లాడారు. దేశాన్ని రక్షించాలన్నా.. రామరాజ్యం రావాలన్నా మళ్ళీ మోదీ ప్రధాని కావాలన్నారు.

మోదీని కాదని కాంగ్రెస్ కు ఓటేస్తే పేదోళ్ల పరిస్థితి దారుణంగా మారుతుందన్నారు. బీజెపీ వైపు రాముడు, మోదీ ఉంటే.. కాంగ్రెస్ వైపు రాహుల్, రజాకార్లు, కేసీఆర్ ఉన్నారన్నారు. బీఆర్ఎస్ కు ఓట్లు వేస్తే మురికి కాలువలో వేసినట్లేనని, ఆ పార్టీ వచ్చే ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రెండు నెలల్లోనే రూ. 10 వేల కోట్ల అప్పులు చేసిందని విమర్శించారు.