Babu Mohan: నేనొచ్చేసరికి నా కోటన్న వెళ్లిపోయాడు.. కన్నీటి పర్యంతమైన బాబూమోహన్‌

Babu Mohan: నేనొచ్చేసరికి నా కోటన్న వెళ్లిపోయాడు.. కన్నీటి పర్యంతమైన బాబూమోహన్‌

నటుడు కోట శ్రీనివాసరావు మృతిపట్ల సినీ ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. ఈ క్రమంలో కోట భౌతిక కాయాన్ని సందర్శించిన బాబూ మోహన్‌ తమ అన్నదమ్ముల అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు.

‘‘ఈ రోజు చాలా దురదృష్టకరమైన రోజు. రెండు రాష్ట్రాల ప్రజలకంటే నాకే ఎక్కువ ఆత్మీయుడు కోటన్న. మేమిద్దరం సినిమాల్లోనే కాదు, బయట కూడా సరదాగా ఉండేవాళ్లం. సెటైర్లు వేస్తూ మాట్లాడుకునేవాళ్ళం. రెండు రోజుల కిందటే ఇద్దరం మాట్లాడుకున్నాం. ఇంటికి వచ్చి కలుస్తానని చెప్పా. నేనొచ్చేసరికి ఆయన లేడు. నా కోటన్న వెళ్లిపోయాడు.

ఇంటికొస్తే ఎంతో సంతోషంగా, ఆప్యాయంగా మాట్లాడేవాడు. ఆయనకు అన్నదమ్ములున్నా, నన్నే తన సొంత తమ్ముడిగా భావించేవాడు. ఎన్నోసార్లు ఒకే ప్లేట్లో భోజనం చేశాం. నాకు ముద్దలు కలిపి పెట్టేవాడు. ఏ ఊరుకు షూటింగ్‌కు వెళ్లినా, పక్కపక్క గదుల్లోనే ఉండేవాళ్లం. ఇలా మా జీవితంలో ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. కోటన్న ఆత్మకు శాంతి చేకూరాలని ’’ఆశిస్తున్నాని చెబుతూ బాబూ మోహన్‌ కన్నీటి పర్యంతమయ్యారు.

కోట, బాబూ మోహన్‌లది హిట్ కాంబినేషన్. ఇద్దరూ కలిసి నటిస్తే ఆ సినిమా హిట్టు అన్నంతగా క్లిక్ అయిన కాంబో ఇది. నిజానికి మొదట వీళ్లిద్దరినీ కలిపింది ముత్యల సుబ్బయ్య. ‘మామగారు’ మూవీలో వీళ్లిద్దరినీ కలిపి ఒక ట్రాక్ పెట్టారాయన. సినిమా సక్సెస్ కావడానికి ఆ రెండు పాత్రలూ కూడా కారణం కావడంతో.. అప్పటి నుంచి వీళ్లిద్దరినీ కలిపే కథలు రాసుకునేవారు దర్శకులు. యాభై సినిమాల్లో అలా కలిసి నటించడంతో బైట కూడా ఆత్మీయులుగా మారిపోయారు కోట, బాబూ మోహన్.