ఇక్కడ నీళ్లున్నా జీవులు లేవు
ఇథియోపియా డలాల్ చెరువుల్లో బ్యాక్టీరియా కూడా బతుకుతలే
మార్స్ పైనా ఇలాంటి యాసిడ్ చెరువులే ఉండేవట
ఇతర గ్రహాల మీదా ఇలాంటి పరిస్థితులుంటే బతకలేం
స్పానిష్సైంటిస్టుల రీసెర్చ్ లో వెల్లడి
ఆ చెరువుల్లో ఎప్పుడు చూసినా నిండుగా నీళ్లుంటయి. కానీ అందులో చేపలు కాదు కదా.. కనీసం బ్యాక్టీరియాలు కూడా బతుకుతలేవు! ఎందుకంటే.. ఆ చెరువుల్లో నీళ్లు విపరీతమైన ఉప్పు, యాసిడ్ తో విషవాయువులు వదులుతున్నాయట. అంతేకాదు.. చలికాలంలోనూ పట్టపగలు కూడా ఆ నీళ్లు 45 డిగ్రీ సెంటీగ్రేడ్ల వేడితో సలసలా మసలుతుంటాయట! ఏదో ఏలియన్ గ్రహంపై యాసిడ్ తో నిండిపోయి కుతకుతా ఉడుకుతూ ఉండే పూల్స్ మాదిరిగా కనిపించే ఆ చెరువులు మన భూమిపై.. ఇథియోపియాలోని డలాల్ జియోథర్మల్ ఫీల్డ్ లోనే ఉన్నాయి!
డలాల్ పూల్స్ ఎందుకు మరుగుతున్నయంటే..
డలాల్ ప్రాంతంలో ఎన్నో ఏండ్ల కిందట ఓ భారీ అగ్నిపర్వతం పేలిపోయి ఏర్పడిన పెద్ద పెద్ద గుంతలే ఇప్పుడు చెరువులుగా ఏర్పడ్డాయట. అయితే ఆ ప్రాంతంలో ఇప్పటికీ జియోథర్మల్ యాక్టివిటీ తీవ్ర స్థాయిలో కొనసాగుతుండటంతో అవి యాసిడ్ చెరువులుగా మారిపోయాయట. ప్రస్తుతం ఆ చెరువుల్లోని నీళ్లలో విపరీతమైన ఉప్పు, యాసిడ్ కలిసి ఉన్నాయని, దీనివల్ల ఆ నీళ్లు నిరంతరం మరుగుతూ విష వాయువులను విడుదల చేస్తున్నాయట. ఆ నీళ్లు మైనస్ పీహెచ్ స్థితిలో ఉన్నాయట. అందుకే.. అక్కడ కనీసం బ్యాక్టీరియాలు కూడా బతికే పరిస్థితి లేదని స్పెయిన్ కు చెందిన ‘ఫౌండేషన్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ (ఎఫ్ఈసీఐటీ) రీసెర్చర్లు తమ స్టడీలో గుర్తించారు. ఈ స్టడీ శుక్రవారం ‘నేచర్ ఎకాలజీ అండ్ ఎవల్యూషన్’ అనే జర్నల్లో పబ్లిష్ అయింది.
నీళ్లున్నంత మాత్రాన బతకలేం
భూమిపై మనం బతుకుతున్నామంటే.. అందుకు ప్రధాన కారణం గాలి, నీళ్లు ఉండటం వల్లే. అందుకే.. మన భూమిలాగే నీళ్లు, వాతావరణం ఉన్న గ్రహాల జాడను తెలుసుకోవడం కోసం సైంటిస్టులు ఎన్నో ఏండ్లుగా ప్రయత్నిస్తూనే ఉన్నారు. అయితే, నీళ్లు, వాతావరణం ఉన్నంత మాత్రాన జీవులు బతుకుతాయనుకోవడం భ్రమేనని డలాల్ చెరువులను చూస్తే తెలుస్తోందని రీసెర్చ్ లో పాల్గొన్న సైంటిస్ట్ లోపెజ్ గార్సియా అంటున్నారు. డలాల్ చెరువులతో పాటు వాటి సమీపంలోని ఉప్పునీటి చెరువుల్లో సూక్ష్మజీవుల శిలాజాలు దొరికినప్పటికీ, అవి అక్కడివి కాదని, సమీపంలోని ఎడారి నుంచి గాలి లేదా మనుషుల ద్వారా ఈ చెరువుల్లోకి చేరి చనిపోయి ఉంటాయని గార్సియా వివరించారు. మార్స్ పై కూడా తొలినాళ్లలో ఇలాంటి యాసిడ్ నీళ్ల చెరువులే ఉండేవన్నారు. వేరే గ్రహంపై నీళ్లున్నంత మాత్రాన జీవులకు అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయనుకోవడం కరెక్ట్ కాదని అంటున్నారు.
