
రోజుకొక యాపిల్ తింటే ఆరోగ్యానికి మంచిది. డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సిన అవసరం ఉండదని పరిశోధకులు చెప్తుంటారు. అందుకు కారణం ఫైబర్, విటమిన్స్ యాపిల్‌లో పుష్కలంగా లభించడం. కానీ, అదే పరిశోధకులు యాపిల్ గురించి షాకింగ్ విషయమొకటి వెల్లడించారు. ఒక యాపిల్ పండులో 100 మిలియన్ల(పది కోట్ల)కు పైగా బ్యాక్టీరియాలు ఉంటాయని నిర్ధారించారు. అయితే ఇవి శరీరానికి మంచి చేస్తాయా? చెడు చేస్తాయా? అనేది అవి పండించే పద్ధతిపై ఆధారపడి ఉంటుందని చెప్తున్నారు.
సాధారణంగా యాపిల్స్‌లో ఆరోగ్యానికి మేలు చేసే బ్యాక్టీరియాలు కూడా ఉంటాయి. అయితే ఆ మధ్య కొన్ని యాపిల్ రకాలపై జరిగిన పరిశోధనల్లో డేంజరస్ ఫంగీ జాతుల్ని గుర్తించారు. దీంతో ఆస్ట్రియాకు చెందిన గార్జ్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ పరిశోధకులు యాపిల్‌పై పరిశోధనల్ని ముమ్మరం చేశారు. ఈ రీసెర్చిలో తేలింది ఏంటంటే.. పావు కేజీ బరువు ఉన్న ఒక యాపిల్‌లో సుమారు 10 కోట్ల బ్యాక్టీరియాలు బయటపడ్డాయి. తొక్క, విత్తనాలు, గుజ్జు.. ఇలా ప్రతీదాంట్లోనూ బ్యాక్టీరియాల జాడ ఉంది. అయితే ఆర్గానిక్ పద్ధతుల్లో పండించిన పండ్లకు, సాధారణ పద్ధతుల్లో పండించిన పండ్లకు బ్యాక్టీరియా కౌంట్ విషయంలో పెద్ద తేడాలేవి లేవట. కానీ, సేంద్రీయ పద్ధతుల్లో పండించిన పండ్లలో హానికలిగించే బ్యాక్టీరియా తక్కువగా ఉండటం ఊరట ఇచ్చే విషయమని చెప్తున్నారు.
ALSO READ : Telangana Kitchen: కాకరతో వెరైటీ రెసిపీలు.. టేస్ట్ అదిరిపోద్ది..
ఫ్రెండ్లీ బ్యాక్టీరియాలు!
సాధారణ యాపిల్ పండ్లలో ఫ్రాంటియర్స్ అనే జర్నల్ కథనం ప్రకారం‘ఎశ్చరేషియా– షిజెల్లా’ అనే హానికర బ్యాక్టీరియా ఉంటుంది. కానీ, సేంద్రియ పద్ధతుల్లో పండించిన పండ్లలో వాటి జాడే కనిపించలేదని రీసెర్చర్లు తెలిపారు. సేంద్రియ యాపిల్స్‌లో ‘మిథైలోబ్యాక్టీరియమ్’, ‘లాక్టోబాసిల్లై’ లాంటి ఫ్రెండ్లీ బ్యాక్టీరియాలు అధికంగా కనిపించాయని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన ప్రొఫెసర్ గార్బియెల్ బర్గ్ చెబుతోంది. అయితే యాపిల్స్‌లో మాత్రమే కాదని, దాదాపు అన్ని పండ్లు, కూరగాయల్లో బ్యాక్టీరియా, వైరస్, ఫంగీ జాతులు ఉంటాయని ఆమె అంటోంది. ఉడకబెట్టినప్పుడు, వండినప్పుడు అవి నశిస్తాయని, వాటితోపాటు ఒక్కోసారి మేలు చేసేవి కూడా అంతమవుతుంటాయని అందామె.