ఐఫోన్ ప్రియులకు బ్యాడ్న్యూస్..30 శాతం పెరగనున్న ధరలు

ఐఫోన్ ప్రియులకు బ్యాడ్న్యూస్..30 శాతం పెరగనున్న ధరలు

ఐఫోన్ ప్రియులకు బ్యాడ్ న్యూస్..రాబోయే  ఐఫోన్(iPhone) కొత్త మోడళ్ల ధరలు భారీగా పెరగనున్నాయి. అమెరికా, చైనా సుంకాల యుద్ధం, స్మార్ట్ ఫోన్ మార్కెట్లో ఐఫోన్ కు గట్టి పోటీదారు అయిన శాంసంగ్ తో పోటీ పడేందుకు AI ఫీచర్లను తీసుకొస్తున్న క్రమంలో టెక్నాలజీ అప్డేట్స్ వంటి కారణాలతో ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. 

‘‘ఎంకి పెళ్లి..సుబ్బి చావుకు వచ్చిందనట్లు’’గా  అమెరికా, చైనా సుంకాల యుద్ధం ఇప్పుడు ఐఫోన్ల ధరలు పెరిగేందుకు కారణం అవుతున్నాయి. ప్రస్తుతం ఆపిల్ చాలా ఐఫోన్లు చైనాలో అసెంబుల్ అవుతున్నాయి. సుంకాల యుద్ధం కారణంగా కంపెనీ త్వరలో గణనీయమైన ఆర్థిక భారాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది. ఇదికస్టమర్లపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపనుంది. 

ఆపిల్ పై 900 మిలియన్ డాలర్ల టారిఫ్ భారం

ది వాల్ స్ట్రీట్ జర్నల్ రిపోర్టు ప్రకారం..చైనా,అమెరికా మధ్య కొనసాగుతున్న వాణిజ్య ఉద్రిక్తతల కారణంగా దిగుమతి చేసుకున్న ఎలక్ట్రానిక్స్‌పై 30 శాతం వరకు పరస్పర సుంకాలు విధించే అవకాశం ఉంది. దీనివల్ల ఆపిల్‌కు అదనపు ఖర్చుల రూపంలో 900 మిలియన్ డాలర్లు అంటే  సుమారు రూ.7,638 కోట్లు నష్టం వాటిల్లే అవకాశం ఉంది. 

ఈ అదనపు ఖర్చును ఆపిల్ తన ఐఫోన్ల ధరను పెంచడం ద్వారా కస్టమర్లపై భారాన్ని మోపవచ్చు. గతేడాది iPhone 16  USD 799 ప్రారంభ ధరతో విడుదలైంది.ఇది 30 శాతం పెరుగుదలతో 1,142 USD లకు పెరిగే అవకాశంఉంది. 

శామ్సంగ్ AI తో ఆపిల్ పై అదనపు ఒత్తిడి

ధరల సమస్యలతో పాటు, ఆపిల్ కూడా శామ్ సంగ్ వంటి పోటీదారులతో పోటీ పడాల్సిఉంది. దక్షిణ కొరియా బ్రాండ్ ఇప్పటికే తన స్మార్ట్‌ఫోన్‌లలో శక్తివంతమైన AI లక్షణాలను ప్రవేశపెట్టింది. ఆపిల్ తన కొత్త ఐఫోన్‌లలో Chat GPT -ఆధారిత ఫీచర్లను చేర్చడం ద్వారా నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తోంది. 

అయితే ఐఫోన్ ధరలు భారీగా పెరిగితే ప్రస్తుతం పోటీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ఆపిల్ తన స్థానాన్ని కోల్పోయే అవకాశం ఉంది. ముఖ్యంగా శామ్‌సంగ్ AI- ఆవిష్కరణలతో దూకుడుగా ఉంది. దీనితో ఆపిల్ మార్కెట్ పొజిషన్ పై  ప్రభావం పడే అవకాశం ఉంది. అయితే ఇప్పటివరకు ఐఫోన్ల కొత్త మోడళ్ల ధరల పెరుగుదలపై ఆపిల్ అధికారికంగా స్పందించలేదు. మార్కెట్ ను నిశితంగా పరిశీలిస్తోంది.