ఎంజీఎం మార్చురీలో శవాల కంపు.. పేరుకు 17 ఫ్రీజర్లు.. ఒక్కటీ పనిచేస్తలే..

ఎంజీఎం మార్చురీలో శవాల కంపు.. పేరుకు 17 ఫ్రీజర్లు.. ఒక్కటీ పనిచేస్తలే..
  •  స్ట్రెచర్లు, పోస్ట్‌‌మార్టం గద్దెలపైనే డెడ్‌‌బాడీలు
  • రోజుల తరబడి అలాగే ఉండడంతో కుళ్లిపోతున్న అనాథ శవాలు
  • మెయిన్‌‌ రోడ్డుదాకా దుర్వాసన
  • ఇబ్బందులు పడుతున్న స్థానికులు

వరంగల్/వరంగల్ సిటీ, వెలుగు : వరంగల్‌‌ ఎంజీఎం మార్చురీకి రోజుకు పదుల సంఖ్యలో డెడ్‌‌బాడీలు వస్తుండడం, వాటిని భద్రపరిచే ఫ్రీజర్లు పనిచేయకపోవడంతో ఆ ప్రాంతమంతా కంపు కొడుతోంది. కొన్ని ఫ్రీజర్లు మూలకు పడి నాలుగు నెలలు అవుతున్నా పట్టించుకునేవారే కరువయ్యారు. శవాలు రోజుల తరబడి అక్కడే ఉంటుండడంతో కుళ్లిపోయి వాసన మెయిన్‌‌ రోడ్డును తాకుతోంది. దీంతో ఇటు హాస్పిటల్‌‌లో ఉన్న వారు.. అటు స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ప్రతిరోజు 15కు పైగా డెడ్‌‌బాడీలు

ఎంజీఎం హాస్పిటల్‌‌ ఉమ్మడి వరంగల్‌‌తో పాటు కరీంనగర్‍, ఖమ్మం, నల్గొండ వైపు బార్డర్‍లో ఉండే జిల్లాల్లో ఆత్మహత్యలు, ప్రమాదవశాత్తు జరిగే మరణాలకు పోస్ట్‌‌మార్టం సేవలు అందిస్తోంది. ఈ హాస్పిటల్‌‌కు వివిధ ప్రాంతాల నుంచి ప్రతిరోజు 15కు పైగా మృతదేహాలు వస్తుంటాయి. ఇందులో ఎంజీఎంలో ట్రీట్‌‌మెంట్‌‌ తీసుకుంటూ చనిపోయిన వారి డెడ్‌‌బాడీలే ఎనిమిది నుంచి పది వరకు ఉంటాయి. ఉమ్మడి జిల్లా పరిధిలోని ఆసుపత్రుల నుంచి అనుమానాస్పద మరణాలకు సంబంధించినవి.. ప్రమాదాల్లో చనిపోయిన వారివి, ఆత్మహత్యల కేసులు, అనాథ శవాలు ఇలా.. పోస్టుమార్టం కోసం ఇక్కడికి వచ్చే డెడ్‌‌బాడీలు మరో ఐదు నుంచి ఎనిమిది వరకు ఉంటాయి.

మూలకుపడ్డ 17 ఫ్రీజర్లు

ఎంజీఎం మార్చురీలో మొత్తం 17 ఫ్రీజర్లు ఉన్నాయి. ఏడాదిన్నర నుంచి ఒక్కో ఫ్రీజర్‌‌ రిపేర్‌‌కు వస్తోంది.  పాడైన వాటికి రిపేర్లు చేయకపోవడంతో ప్రస్తుతం ఏ ఒక్క ఫ్రీజర్‌‌ కూడా పనిచేయడం లేదు. ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు ఎంజీఎంకు వచ్చినప్పుడు ఈ సమస్యను తెలుసుకొని తాత్కాలికంగా రిపేర్లు చేయిస్తున్నారు. తర్వాత మళ్లీ అదే సమస్య రిపీట్ అవుతోంది. దీంతో మార్చురీకి వచ్చిన డెడ్‌‌బాడీలను వచ్చినట్లే స్ట్రెచర్లపై గానీ, పోస్ట్‌‌మార్టం నిర్వహించే గద్దెలపై గానీ పడుకోబెడుతున్నారు. 

టెంపరేచర్లు తగ్గించేందుకు నానాఅవస్థలు

అనాథశవాలను కనీసం మూడు రోజులు భద్రపరచాల్సి ఉంటుంది. కానీ ఫ్రీజర్లు పనిచేయకపోవడంతో డెడ్‌‌బాడీలను మార్చురీ ఆవరణలోనే రోజుల కోద్దీ ఉంచుతున్నారు. గంటల వ్యవధిలోనే అవి పాడై భరించలేని కంపు కొడుతున్నాయి. దీంతో ఏం చేయాలో అర్థంకాని ఫోరెన్సిక్‌‌ డాక్టర్లు, సిబ్బంది మార్చురీ గదుల్లో టెంపరేచర్లు తగ్గించడం కోసం నానా అవస్థలు పడుతున్నారు. 24 గంటలూ ఫ్యాన్లు నడిపించడంతో పాటు ఎగ్జాస్ట్‌‌ ఫ్యాన్లు వాడుతున్నారు.

 అయినా టెంపరేచర్‌‌ తగ్గకపోవడంతో డెడ్‌‌బాడీల నుంచి తీవ్ర దుర్వాసన వెదజల్లుతోంది. మార్చురీ పక్క నుంచే మెయిన్‌‌ రోడ్‌‌ ఉండగా.. మృతదేహాల నుంచి 200 మీటర్ల వరకు వాసన వస్తోంది. ఇక్కడి సమస్యను మార్చురీ సిబ్బంది ఉన్నతాధికారులకు చెప్పినా ఎలాంటి స్పందన లేకపోవడంతో సమస్య తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది.

మార్చురీ ఏరియాలో ఉండలేం 

మా బంధువు చనిపోతే డెడ్‌‌బాడీని చూసేందుకు ఎంజీఎం మార్చురీ వద్దకు వచ్చాం. ఫ్రీజర్లు పనిచేయకపోవడంతో డెడ్‌‌బాడీలను బయటే ఉంచారు. అవి కుళ్లిపోయి భరించలేని వాసన వస్థోంది. ముక్కులకు కర్చీఫ్‌‌ కట్టుకున్నప్పటికీ వాసన భరించలేకపోయాం. దీంతో డెడ్‌‌బాడీని చూడకుండానే బయటకు వచ్చేశాం.- భీమయ్య, కోనంపేట్‍, మంచిర్యాల

డీఎంఈ  దృష్టికి తీసుకెళ్లాం  

మార్చురీలో ఫ్రీజర్లు పనిచేయడం లేదని మాకు సమాచారం వచ్చింది. ఈ విషయాన్ని డీఎంఈ దృష్టికి తీసుకెళ్లాం. అక్కడి నుంచి వచ్చే ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాం. సమస్య పరిష్కారానికి కృషి చేస్తాం.- శశికుమార్, ఎంజీఎం ఆర్ఎంవో