
- గీ బియ్యం ఎట్ల తినాలె!.. మెదక్ జిల్లాలో అధ్వానంగా రేషన్ బియ్యం సప్లై
- పురుగులు పట్టిన, తుట్టెలు కట్టిన బియ్యాన్ని ఎలా తినాలని జనం ఆవేదన
- క్వాలిటీ చెక్చేయకుండా పంపిస్తున్న అధికారులు
మెదక్(శివ్వంపేట), వెలుగు:మెదక్జిల్లాలోని రేషన్‌షాపులకు సప్లై చేస్తున్న బియ్యం అధ్వానంగా ఉంటున్నాయి. తుట్టెలు కట్టి, పురుగులు పట్టి ఉంటున్న బియ్యాన్ని తీసుకునేందుకు లబ్ధిదారులు నిరాకరిస్తున్నారు. ముక్కిపోయిన బియ్యాన్ని ఎలా తినాలని డీలర్లను ప్రశ్నిస్తున్నారు. చాలా చోట్ల ఇదే పరిస్థితి ఉంది. జనం తీసుకోకపోవడంతో డీలర్లు లారీలను వెనక్కి తిప్పి పంపుతున్నారు. 21 మండలాల్లో మొత్తం 521 రేషన్ షాపులు ఉన్నాయి. వాటి పరిధిలో తెల్ల కార్డులు 2,00,949, అంత్యోదయ కార్డులు 13,860, అన్నపూర్ణ కార్డులు 69 ఉన్నాయి. ఆహార భద్రత కింద ప్రభుత్వం ఒక్కొక్కరికి 5 కిలోల చొప్పున రేషన్ బియ్యం అందజేస్తోంది. జిల్లాలోని 7 ఎంఎల్ఎస్(మండల్లెవల్స్టాకిస్ట్) పాయింట్ల ద్వారా రేషన్‌షాపులకు బియ్యం సప్లై అవుతోంది. కాగా నాలుగైదు నెలలుగా రేషన్‌షాపులకు వస్తున్న బియ్యం తుట్టెలు కట్టి, పురుగులు పట్టి ఉంటున్నాయి. కొన్నిషాపులకు వస్తున్న బియ్యంలో తౌడు, నూకలు కలిపి ఉంటున్నాయి.
అధికారులు పట్టించుకోవట్లే
రేషన్ షాపులకు పంపించే ముందు క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్లు ఎంఎల్ఎస్ పాయింట్లో బియ్యాన్ని చెక్చేయాలి. బాగున్నాయి అనుకున్న తర్వాతే పాస్ చేయాలి. ప్రస్తుత పరిస్థితిని చూస్తుంటే అలా జరగడం లేదని తెలుస్తోంది. క్వాలిటీ చెక్చేయకుండానే పంపించేస్తున్నారు. మామూళ్లు తీసుకుంటూ బియ్యాన్ని పాస్చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
వరుస ఘటనలు
శివ్వంపేట మండలం లచ్చిరెడ్డిగూడెంలోని రేషన్‌షాపుకు ముక్కిపోయిన, పురుగులు పట్టిన బియ్యం వచ్చింది. వాటిని తీసుకునేందుకు నిరాకరిస్తూ గురువారం గ్రామస్తులు ఆందోళనకు చేశారు. పేదలకు అందించే బియ్యం ఇంత దారుణంగా ఉంటే ఎలా తింటారని సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈనెల15న రామాయంపేట మండలం లక్ష్మాపూర్రేషన్ షాపులో పంపిణీ చేసిన బియ్యం తుట్టెలు కట్టి, పురుగులు పట్టి ఉండటంతో గ్రామస్తులు వాటిని తీసుకునేందుకు నిరాకరించారు. వాటిని ఎలా తినాలంటూ డీలర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే మండలం కాట్రియాల గ్రామంలోనూ పురుగులు పట్టిన బియ్యం రావడంతో పంపిణీని నిలిపివేశారు. జనవరి నెలలో కౌడిపల్లి మండలం కొట్టాల, భుజరంపేట, కూకుట్లపల్లి, కౌడిపల్లిలోని రేషన్‌షాపులకు ముక్కిన, తుట్టెలు కట్టిన బియ్యం వచ్చాయి. బాగాలేని బియ్యం తమకు వద్దని ఆయా గ్రామాల్లోని ప్రజలు నిరాకరించారు.ఫిబ్రవరి నెలలో కొల్చారం మండలంలోని చాలా రేషన్‌షాపులకు ఇలాగే తుట్టెలు కట్టిన బియ్యం సరఫరా అయ్యాయి. తౌడు, నూక, తుట్టెలు కట్టి ఉండటంతో జనం తీసుకోలేదు.
ఆ బియ్యం అసలే తినలేం
మాకు రేషన్ బియ్యమే ఆధారం. రెగ్యులర్‌గా అవే తింటం. పురుగులు పట్టి, తుట్టెలు కట్టి, చెత్త, దుమ్ము ఉన్న బియ్యం ఇస్తే ఎట్ల తింటం. ఈ నెల వచ్చిన బియ్యం ఏమీ బాగాలేవు. అవి తినలేం. మనుషులు కాదు పశువులు కూడా ఆ బియ్యం తినవు.
- అశోక్, నవాపేట, శివ్వంపేట మండలం
వాపస్ పంపి మంచివి తెప్పిస్తం
రేషన్ షాపులకు తుట్టెలు కట్టిన, ముక్కిపోయిన బియ్యం ఎందుకు వచ్చాయో జిల్లా సివిల్ సప్లై ఆఫీసర్‌తో మాట్లాడతాం. ఏఏ గ్రామాలకు మంచిగ లేని బియ్యం వచ్చాయో గుర్తిస్తాం. వాపస్ పంపి మంచి బియ్యాన్ని తెప్పించి సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటాం.
- శ్రీనివాసచారి, శివ్వంపేట తహసీల్దార్