
మొదటి విడతతోనే చేతులు దులుపుకున్న సర్కారు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో గొర్రెలు, బర్రెల పంపిణీపై ప్రభుత్వం నజర్ తగ్గినట్టు కన్పిస్తోంది. ఎలక్షన్లకు ముందు తొలి విడత పంపిణీలో చేసిన హడావుడి ఇప్పుడు కన్పించడం లేదు. ఈ రెండింటిలో గొర్రెల పంపిణీ పథకం లక్ష్యంలో సగానికి మించకపోగా, పాడి పశువుల పంపిణీ పావు వంతుకూడా దాటలేదు. ఐదు నెలలుగా ఈ పథకం పూర్తిగా నిలిచిపోయింది. రెండో విడత గొర్రెల పంపిణీపై అసెంబ్లీలో పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టమైన సమాధానం ఇవ్వలేదని గొల్ల, కురుమలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ బుధవారం అసెంబ్లీని ముట్టడిస్తామని గొర్రెల పెంపకం దార్ల సంఘం ప్రకటించింది. డీడీలు తీసి యూనిట్ల కోసం ఎదురు చూస్తున్న గొర్రెల కాపర్లు ఆందోళనలో పాల్గొనాలని పిలుపునిచ్చింది.
గొర్రెల పంపిణీ సగమే
2017లో రూ.6,835 కోట్లు అంచనాలతో రాష్ట్రంలోని 7 లక్షల 29 వేల 67 గొల్ల కురుమల కుటుంబాలకు గొర్రెలు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత ఫిబ్రవరి నాటికి 3 లక్షల 65 వేల 682 గొర్రెల యూనిట్లు పంపిణీ చేశారు. ఇంకా 3 లక్షల 63 వేల 385 యూనిట్లు పంపిణీ చేయాల్సి ఉంది. గొర్రెల యూనిట్ కోసం ఒక్కో లబ్ధిదారు రూ.31,250 చొప్పున డీడీ తీసి ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం వర్షాలు పడి గడ్డికి కొరత లేదని, ఇప్పుడు పంపిణీ చేస్తేనే గొర్లు ఎదుగుతాయని గొల్లకురుమలు అంటున్నారు. ఇప్పటికే పలు జిల్లాల్లో గొల్ల, కురుమలు నిరసనలు, ఆందోళనలు చేపట్టారు. ఈ బడ్జెట్‌లో గొర్రెల పంపిణీపై డీపీఆర్ కూడా రూపొందించలేదని సమాచారం. దీంతో ఈసారి బడ్జెట్‌లో కేటాయింపులు చేయలేదు.
పాడి పశువుల పంపిణీ.. పావొంతే
పాల ఉత్పత్తి పెంచాలనే లక్ష్యంతో ప్రభుత్వం పాడి పశువుల పథకాన్ని తీసుకొచ్చింది. పాలను సరఫరా చేస్తున్న సహకార సంఘాల్లోని సభ్యులకు బర్లు, ఆవులు ఇవ్వాలని నిర్ణయించింది. రాష్ట్రంలో 2 లక్షల13 వేల 917 పశువుల పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే ఇప్పటివరకు సరఫరా చేసింది మాత్రం 57 వేల 842 మాత్రమే. ఇంకా సుమారు లక్షన్నర పంపిణీ చేయాల్సి ఉంది. ప్రభుత్వం బడ్జెట్‌లో కేటాయింపులు చేయక పోవడంతో బర్రెల పంపిణీ ముందుకు సాగేలా లేదని పాడి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇన్సెంటివ్స్ బాకీ రూ.200 కోట్లు
పాడి రైతులకు ప్రభుత్వం లీటరుకు రూ.4 చొప్పున ప్రోత్సాహకం ఇస్తామని ప్రకటించింది. ఏడాదిన్నరగా ఇన్సెంటివ్ ఇవ్వడం లేదు. అన్ని జిల్లాలకు కలిపి దాదాపు రూ.200 కోట్ల మేర పాడి రైతులకు ఇన్సెంటీవ్ పెండింగ్ ఉన్నట్టు సమాచారం.