
తెలంగాణ ప్రగతి భవన్ పై నీలి జెండా ఎగిరేదాకా ‘బహుజన రాజ్యాధికార యాత్ర’ కొనసాగుతుందని బీఎస్పీ ఏడు రాష్ట్రాల ఇన్ చార్జి, రాజ్యసభ సభ్యుడు రాంజీ గౌతమ్ అన్నారు. ‘‘మహనీయుల ఆశయాలను నిజం చేయడానికి మనకు అధికారం కావాలి’’ అని ఆయన వ్యాఖ్యానించారు. 2023లో బహుజనుల రాజ్యం రాబోతోందని పేర్కొన్నారు. బీఎస్పీ తెలంగాణ స్టేట్ చీఫ్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ చేపట్టిన ‘బహుజన రాజ్యాధికార యాత్ర’ 100 రోజులు పూర్తి చేసుకుంది. ఈసందర్భంగా హనుమకొండ లోని హయగ్రీవాచారి మైదానంలో ఆదివారం రాత్రి జరిగిన బీఎస్పీ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్, రాష్ట్ర ప్రధాన సమన్వయ కర్త మంద ప్రభాకర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నిశాని రామచంద్రు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.