
నల్గొండ అర్బన్, వెలుగు: అణగారిన వర్గాలకు రాజ్యాధికారం దక్కాల్సిందేనని, తద్వారానే సమాజంలో మార్పు వస్తుందని బీసీ, ఎస్సీ, ఎస్టీ రాజ్యాధికార జేఏసీ కన్వీనర్ విశారదన్ మహారాజ్ స్పష్టం చేశారు. ఆదివారం నల్గొండలోని పీఆర్టీయూ భవన్లో ‘సామాజిక న్యాయం-.. మన రాజ్యాధికారం’పై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. రాజ్యాధికారం సాధించినప్పుడే దళిత, బహుజనులకు అసలైన స్వాతంత్ర్యం దక్కుతుందన్నారు. అన్ని పార్టీలు సొంత ఎజెండా కోసమే ఎస్సీ, ఎస్టీ, బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నాయని విమర్శించారు. ప్రభుత్వ పథకాలతో ఒరిగేదేమీ లేదన్నారు.
10 శాతం లేని రెడ్లు, వెలమలు, 90 శాతం ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రజలను పాలించడం అప్రజాస్వామికమన్నారు. బహుజనులకు రాజ్యాధికారమే లక్ష్యంగా ఐక్యంగా ముందుకు సాగుదామని రిటైర్డ్ ఐఏఎస్ టి. చిరంజీవులు పిలుపునిచ్చారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలు మన ఓట్లను మనమే వేసుకొని రాజ్యాధికారం సాధించే దిశగా ఉద్యమకార్యాచరణను రూపొందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్లు రామయ్య యాదవ్, కుమారస్వామి, నాయకులు దాసోజు లలిత, వేణు, శేఖర్, రాజారాం యాదవ్, జిల్లా నేతలు బి దుర్గాప్రసాద్, మహేశ్వర చారి, కళ్యాణ్ గౌడ్, కృష్ణ యాదవ్, బీసీ, ఎస్సీ ఎస్టీ సంఘాల నేతలు పాల్గొన్నారు.