సికింద్రాబాద్ రైల్వే అల్లర్ల కేసులో 16మందికి బెయిల్

సికింద్రాబాద్ రైల్వే అల్లర్ల కేసులో 16మందికి బెయిల్

హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ వద్ద జరిగిన అల్లర్ల కేసులో నిందితులకు బెయిల్ మంజూరైంది. 16మంది నిందితులకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. షరతులతో కూడిన బెయిల్ ఇచ్చిన హైకోర్టు.. రూ.20వేలతో పాటు రెండు షూరిటీలు సమర్పించాలని ఆదేశించింది. ఆర్మీ రిక్రూట్మెంట్ అభ్యర్థుల తరఫున టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. సోమవారం విచారణ చేపట్టిన హైకోర్టు ఆర్మీ రిక్రూట్ మెంట్ అభ్యర్థులకు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు ఇచ్చింది.

కేంద్ర ప్రభుత్వం ఆర్మీలో నియామకాలను చేపట్టడానికి తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకంపై దేశంలో అనేక రాష్ట్రాలతో పాటు.. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో ఆందోళనకారులు నిరసనలు తెలిపారు.  సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో భారీ సంఖ్యలో ఆందోళనకారులు విధ్వసం సృష్టించారు. ఈ క్రమంలోనే కొంతమంది ఆర్మీ రిక్రూట్ మెంట్ అభ్యర్థులను అరెస్ట్ చేశారు. దీనిపై హైకోర్టులో విచారణ చేపట్టగా ఇవాళ 16 మంది  ఆర్మీ రిక్రూట్ మెంట్ అభ్యర్థులకు బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పదకాన్ని నిరసిస్తూ జూన్ 17వ తేదీన సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో అభ్యర్థులు భారీ విధ్వంసం సృష్టించిన విషయం తెలిసిందే.