జూబ్లీ హిల్స్ కేసులో ఎమ్మెల్యే కుమారుడికి బెయిల్

జూబ్లీ హిల్స్ కేసులో ఎమ్మెల్యే కుమారుడికి బెయిల్

హైదరాబాద్: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన జూబ్లీహిల్స్ పబ్ ఘటన కేసులో నిందితుడిగా ఉన్న ఎమ్మెల్యే కుమారుడికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అంతకు ముందు ఈ కేసులో నిందితులుగా ఉన్న మిగతా నలుగురు మైనర్లకు కూడా ఇవాళ జువైనల్ జస్టిస్ బోర్డు బెయిల్ మంజూరు చేసింది. ఇప్పటికే రెండు సార్లు నిందితుల బెయిల్ తిరస్కరించిన బోర్డు ఈ సారి షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. ఈ కేసులో పోలీసులకు సహకరించడంతో పాటు హైదరాబాద్ డీపీవో ముందు ప్రతి నెలా హాజరుకావాలని ఆదేశించింది.

అయితే ఎమ్మెల్యే కుమారుడికి మాత్రం కొన్ని అనివార్య కారణాల వల్ల జువైనల్ కోర్టు బెయిల్ నిరాకరించింది. దీంతో అతడు హైకోర్టులో అప్పీల్ చేసుకున్నాడు. కేసు విచారించిన హైకోర్టు... ఎమ్మెల్యే కుమారుడికి బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులిచ్చింది. దీంతో మొత్తం ఆరుగురు నిందితుల్లో ఐదుగురికి బెయిల్ రాగా... ఇక ఏ1 నిందితుడైన సాదుద్దీన్ కు కోర్టు బెయిల్ ఇవ్వలేదు. 

మే 28న జూబ్లీహిల్స్‌లోని అమ్నేషియా  పబ్‌లో పార్టీ జరిగిన తర్వాత 17 ఏళ్ల  బాలికపై ఐదుగురు మైనర్లు మరో మేజర్ యువకుడు సహా బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇవాళ ఐదుగురు మైనర్లకు బెయిల్ మంజూరు చేసింది  కోర్టు.