- ఎంబీఎస్సీ ఫౌండర్ ప్రెసిడెంట్ బైరి వెంకటేశం
హైదరాబాద్, వెలుగు: డాక్టర్ బీఆర్. అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ జయంతి ఉత్సవాల కమిటీ చైర్మన్ పదవిని ఎస్సీ ఉపకులాలకు కేటాయించాలని ఎంబీఎస్సీ కులాల హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు బైరి వెంకటేశం డిమాండ్ చేశారు. ప్రతి ఏటా ఈ కీలక పదవులను కేవలం మాదిగ, మాల సామాజిక వర్గాలకే ఇస్తున్నారని, దీనివల్ల మిగిలిన 57 ఉపకులాలకు తీవ్ర అన్యాయం జరుగున్నదని మంగళవారం పత్రిక ప్రకటనలో ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఎస్సీ వర్గీకరణ జరిగిన తర్వాత కూడా ఉపకులాలకు తగిన గుర్తింపు లభించడం లేదని, ఇప్పటికైనా ప్రభుత్వం చిన్న కులాలను గుర్తించాలని కోరారు. రాబోయే జయంతి ఉత్సవాలకు సీఎం, ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి స్వయంగా హాజరై కార్యక్రమాలను జయప్రదం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
