డబుల్ బెడ్రూం ఇండ్లు ఎప్పుడిస్తరు?

డబుల్ బెడ్రూం ఇండ్లు ఎప్పుడిస్తరు?

శంషాబాద్, వెలుగు:  డబుల్ బెడ్రూం ఇండ్ల ఇస్తామంటూ ప్రభుత్వం మోసం చేసిందని శంషాబాద్ మున్సిపాలిటీ బీజేపీ నేతలు మండిపడ్డారు. ఆదివారం తొండుపల్లి, కిషన్ గూడ గ్రామస్తులతో కలిసి బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బైతి శ్రీధర్ ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ..  అధికారంలోకి వచ్చి తొమ్మిదేండ్లు గడిచినా బీఆర్ఎస్ సర్కారు శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో ఒక్క డబుల్ బెడ్రూం ఇవ్వలేదని ఆరోపించారు. ఎన్నికలు రాగానే స్కీమ్ ల పేరుతో జనాన్ని మభ్య పెడుతున్నారన్నారు. 

 రంగారెడ్డి జిల్లాలో రూ. లక్షా 6 వేల దరఖాస్తులు వస్తే రాష్ట్ర ప్రభుత్వం కనీసం 6 వేల డబుల్ బెడ్రూం ఇండ్లు కూడా పూర్తి చేయలేదన్నారు. ఇప్పటి వరకు కేంద్రం నుంచి డబుల్ బెడ్రూం నిర్మాణాలకు అందిన నిధులు ఎక్కడ ఉపయోగించారో జనానికి చెప్పాలని డిమాండ్ చేశారు.  నిధులన్నీ సొంత ఖాతాలోకి మళ్లించుకుని పేదలను గుడిసెల్లో, రోడ్లపై నివసించేలా చేస్తున్నారని మండిపడ్డారు.

 రాజేంద్రనగర్ ఎమ్మెల్యే  ఇప్పటివరకు సెగ్మెంట్ పరిధిలో 400 ఎకరాలను రూ.100 కోట్లకు ఎకరా లెక్క అమ్ముకున్నారని ఆరోపించారు. పేదలకు ఇండ్లు నిర్మించేందుకు స్థలం దొరకడం లేదని ఎమ్మెల్యే చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. డబుల్ బెడ్రూం ఇండ్లు ఇచ్చే వరకు పోరాటం చేస్తామని శ్రీధర్ తెలిపారు.