కాగజ్ నగర్ శివారులోని ఏజెన్సీలో బాజాప్తా వెంచర్

కాగజ్ నగర్ శివారులోని ఏజెన్సీలో బాజాప్తా వెంచర్
  •     ఐదెకరాల్లో చదును చేసి ప్లాట్లు
  •     చోద్యం చూస్తున్న రెవెన్యూ యంత్రాంగం

ఆసిఫాబాద్/కాగజ్ నగర్, వెలుగు: ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ శివారులోని ఏజెన్సీ ప్రాంతంలో బాజాప్తా అక్రమ వెంచర్లు వేసి చదును చేస్తున్నారు. సుమారు ఐదెకరాల్లో భూమిని కబ్జా చేశారు. ఇంత జరుగుతున్నా రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగజ్ నగర్ నుంచి ఈస్​గాం వెళ్లే దారిలోని ఏజెన్సీ భూముల్లో గిరిజనులు పంటలు సాగుచేసుకుంటున్నారు.

అయితే, ఆ ప్రాంతం శివ మల్లన్న ఆలయానికి దగ్గర మెయిన్ రోడ్డుకు ఆనుకుని ఉన్న ఐదెకరాల భూమిని కబ్జాదారులు చదును చేసి ప్లాట్లు చేస్తున్నారు. భూమికి హద్దుగా ప్రహరీ ఏర్పాటు చేసి మరీ.. మూడు వరుసల్లో సుమారు 100 ప్లాట్లుగా మార్చి హద్దు రాళ్లు వేశారు. ‘‘మా దగ్గర ప్లాట్లు కొంటే ఎటువంటి ఇబ్బందులూ ఉండవు, మేము అందరితో మాట్లాడాం. అంతా మేం చూసుకుంటాం” అని వెంచర్ వేసిన వ్యక్తులు ఆ ప్లాట్లు కొనేవారికి భరోసా ఇస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.

ఏజెన్సీ భూములు అమ్మడం, కొనడం నిషిద్ధం

 కాగజ్ నగర్ మండలం చింతగూడ, ఈస్​గాం గ్రామాలు ఏజెన్సీ ప్రాంతంగా ఉన్నాయి. ఇక్కడ భూములను వంశపారంపర్యంగా అనుభవిం చడం, వారసత్వంగా సాగు చేయడం తప్ప భూముల అమ్మకాలు, కొనుగోలు చట్ట విరుద్ధం. అయితే భూ కొందరు కబ్జాదారులు రెవెన్యూ అధికారులను మచ్చిక చేసుకొని ఈ తతంగం నడిపిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.

నిత్యం వాహనాలతో రద్దీగా ఉండే మెయిన్ రోడ్ కు ఆనుకొని ఉన్న భూమిలో ఈ అక్రమ వెంచర్ వేసినా అధికారులు కన్నెత్తి చూడకపోవడం విస్మయం కలిగిస్తోంది. ఇక్కడ ఎకరం భూమి రూ.80 లక్షల నుంచి రూ.కోటి పలుకు తోంది. కొందరు అమాయకులను ఈ వెంచర్ లో ప్లాట్లు కొనేందుకు ఒప్పించి అడ్వాన్స్ లు కూడా తీసుకు న్నట్లు సమాచారం. ఈ అక్రమ వెంచర్​పై తహసీల్దార్ కిరణ్ కుమార్ ను వివరణ కోరగా.. వెంచర్ వేస్తున్న విషయం తన దృష్టికి రాలేదని, ఎవరైనా కంప్లైంట్ చేస్తే విచారణ చేయిస్తానని చెప్పారు.

1/70కి తూట్లు..

అడ్డూ అదుపు లేకుండా అసైన్డ్ భూములు, ఏజెన్సీ ప్రాంతంలోని భూముల్లో వెంచర్లు వేస్తే అధికారులెవరూ పట్టించుకోవడంలేదని జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెవెన్యూ యంత్రాంగం వైఖరితో కాగజ్ నగర్ లాంటి ప్రాంతంలో అసైన్డ్ భూములు, ఏజెన్సీలోని పచ్చని పంట భూములు వెంచర్ల పేరిట రియల్ ఎస్టేట్ వ్యాపారులు కబ్జా చేస్తున్నారు. 1/70 చట్టం ప్రకారం గిరిజన నోటిఫై రెవెన్యూ గ్రామాల్లో భూముల అమ్మకాలు కొనుగోలులో పరిమితులుండగా వాటికి తూట్లు పొడుస్తున్నారు.