కర్నాటకలో అధికారంలోకొస్తే.. బజరంగ్​ దళ్​ను బ్యాన్ చేస్తం

కర్నాటకలో అధికారంలోకొస్తే.. బజరంగ్​ దళ్​ను బ్యాన్ చేస్తం
  • ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ వెల్లడి
  • 200 యూనిట్ల దాకా ఫ్రీ కరెంట్​: ఖర్గే
  • ఆర్టీసీలో మహిళలకు ఫ్రీ ట్రావెల్
  • ప్రతీ వ్యక్తికి నెలకు 10 కిలోల బియ్యం
  • ‘సర్వ జనాంగద శాంతియ తోట’ పేరుతో మేనిఫెస్టో రిలీజ్

బెంగళూరు : కులం, మతం పేరుతో విద్వేషాలు రెచ్చగొట్టేలా వివాదాస్పద కామెంట్లు చేసే బజరంగ్ దళ్, పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ)పై కఠిన చర్యలు తీసుకుంటామని కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో ప్రకటించింది. అలాంటి సంస్థలను గుర్తించి అవసరమైతే బ్యాన్ చేసేందుకు చట్టపరంగా ముందుకు వెళ్తామని హామీ ఇచ్చింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే బీజేపీ సర్కార్ తెచ్చిన ప్రజా వ్యతిరేక చట్టాలను రద్దు చేస్తామని ప్రకటించింది. మంగళవారం బెంగళూరులో ‘సర్వ జనాంగద శాంతియ తోట’ (పీస్ ఫుల్ గార్డెన్ ఆఫ్ ఆల్ కమ్యూనిటీస్) పేరుతో కాంగ్రెస్‌‌‌‌ చీఫ్ మల్లికార్జున ఖర్గే, కర్నాటక మాజీ సీఎం సిద్ధరామయ్య, కర్నాటక కాంగ్రెస్‌‌‌‌ చీఫ్‌‌‌‌ డీకే శివకుమార్‌‌‌‌ మేనిఫెస్టోను విడుదల చేశారు. 


పాడి రైతులకు ‘మిల్క్​ క్రాంతి’ భరోసా


మిల్క్ క్రాంతి స్కీమ్ కింద రోజుకు 1.5 కోట్ల లీటర్ల పాల ఉత్పత్తి జరిగేలా చేస్తామని ఖర్గే అన్నారు. రైతులకు పాల సబ్సిడీని రూ.5 నుంచి రూ.7కి పెంచుతామని ప్రకటించారు. ఆవులు, గేదెలు కొనడానికి పాడి రైతులకు రూ.3లక్షల వరకు జీరో ఇంట్రెస్ట్ రుణం ఇస్తామన్నారు. రూ.50వేల లిమిట్​తో క్రెడిట్ కార్డులు ఇస్తామని ప్రకటించారు. ప్రతీ డివిజన్​లో నందిని డెయిరీ టెక్నాలజీ పాలిటెక్నిక్​లను ఏర్పాటు చేస్తామన్నారు. పీడబ్ల్యూడీ, ఆర్డీపీఆర్, నీటిపారుదల, యూడీ, విద్యుత్​ రంగంలో అవినీతిని అంతం చేసేందుకు ప్రత్యేక చట్టం తీసుకొస్తామని తెలిపారు. నైట్ డ్యూటీ చేసే పోలీసులకు నెలకు రూ.5వేల స్పెషల్ అలవెన్స్ ఇస్తామన్నారు. ఉద్యోగాల కల్పన, మహిళా సాధికారత, నిరుద్యోగ నిర్మూలన, రైతు సంక్షేమం వంటి అంశాలపై దృష్టిసారిస్తామని హామీ ఇచ్చారు.


హనుమంతుడిని అవమానించిన్రు : బీజేపీ


కర్నాటకలో బజరంగ్ దళ్​పై బ్యాన్ విధించడం అంటే హనుమంతుడిని అవమానించడమే అని బీజేపీ ఫైర్ అయ్యింది. 10వ తేదీన ఓటేసేందుకు వెళ్లిన ప్రజలే కాంగ్రెస్​కు బుద్ధి చెబుతారని విమర్శించింది. పార్టీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రో మీడియాతో మాట్లాడుతూ.. ‘‘బజరంగ్​దళ్​ను బ్యాన్ చేస్తామని కాంగ్రెస్ హామీ ఇవ్వడమంటే.. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాను రక్షించే ప్రయత్నం చేయడమే అవుతుంది. కర్నాటక లాంటి పుణ్యభూమిలో హనుమంతుడిని కాంగ్రెస్ అవమానించింది. కర్నాటక భూమి ఆంజనేయ స్వామిది. మా దేవుడిని కాంగ్రెస్ అవమానించింది”అని ఫైర్ అయ్యారు. ఆచరణకు సాధ్యం కాని హామీలతో కాంగ్రెస్​ తన మేనిఫెస్టోను రిలీజ్ చేసిందని విమర్శించారు.


ట్యాక్సుల వాటా కోసం పోరాడుతం


చట్టం, రాజ్యాంగం ఎంతో పవిత్రమైనవని, మెజార్టీ లేదా మైనార్టీ వర్గాల మధ్య శత్రుత్వం లేదా ద్వేషాన్ని పెంచే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఖర్గే స్పష్టం చేశారు. ‘కర్నాటక విజిల్‌‌‌‌ బ్లోయర్స్ ప్రొటెక్షన్ యాక్ట్’ అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ట్యాక్సుల కింద కేంద్రం వసూలు చేస్తున్న దాంట్లో కర్నాటక వాటాను దక్కించుకునేందుకు పోరాడుతామని స్పష్టం చేశారు. రాజ్యాంగ హక్కులను నిర్వీర్యం చేసే కేంద్ర ప్రయత్నాలను అడ్డుకుంటామన్నారు. జాతీయ విద్యా విధానాన్ని తిరస్కరిస్తామని, రాష్ట్ర విద్యా విధానాన్ని రూపొందిస్తామని వివరించారు. 2006 నుంచి సర్వీస్‌‌‌‌లో చేరి పెన్షన్ పొందే ప్రభుత్వ ఉద్యోగులకు ఓపీఎస్​ పొడిగింపును కాంగ్రెస్ పరిశీలిస్తున్నదన్నారు. అన్ని ప్రభుత్వ శాఖల్లోని ఖాళీలను ఏడాదిలోగా భర్తీ చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు.