బక్రీద్ పండుగ సందర్భంగా జూన్ 29వ తేదీ గురువారం హైదరాబాద్ లోని పాతబస్తీ పరిసర ప్రాంతాలు ముస్లింల ప్రార్ధనలతో మారుమోగాయి. ఉదయాన్నే లక్షల సంఖ్యలో వివిధ ప్రార్ధన మందిరాలకు చేరుకున్న ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. అనంతరం ఒకరికొకరు ఈద్ ముబారక్ చెప్పుకున్నారు. అత్యంత చారిత్రాత్మకమైన మీరాలం ఈద్గా కిక్కిరిసిపోయింది. ప్రార్ధనల సందర్భంగా పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. అడుగడుగునా సిసి కెమెరాలతో బందోబస్తు పర్యవేక్షించారు.
ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు జరుపుకునే రెండవ అతి పెద్ద, ముఖ్యమైన పండుగ ఈద్-ఉల్-అధా. దీనినే బక్రా ఈద్, బక్రీద్, ఈద్ ఖుర్బాన్ లేదా ఖుర్బాన్ బయారమి అనే పేర్లతో కూడా పిలుస్తారు. త్యాగాల పండుగ బక్రీద్ పండగను ముస్లింలు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ రోజున వివిధ రకాల మాంసాహార వంటకాలతో విందు ఉంటుంది.
బక్రీద్ ప్రాముఖ్యత.. మత గ్రంథాల ప్రకారం.. సమాజ హితం కోసం, అల్లా ఆజ్ఞ మేరకు మహ్మద్ ప్రవక్త తన కుమారుల్లో ఒకరిని త్యాగం చేయడానికి సిద్ధపడతారు. ఆ త్యాగాన్ని స్మరిస్తూ ఈద్–అల్–అదా జరుపుకుంటారు. అయితే, ముస్లిం ప్రవక్త ఇబ్రహీం తన కుమారుడిని త్యాగం చేయడానికి సిద్ధమైనప్పుడు, అల్లా జోక్యం చేసుకుంటాడు, అతని కొడుకు స్థానంలో బలి ఇవ్వడానికి ప్రత్యామ్నాయాన్ని మార్గాన్ని అందిస్తాడు. దీంతో అతని కొడుకు ప్రాణాలతో తిరిగి వస్తాడు. అల్లాపై విశ్వాసం, నమ్మకం ఉంచితే అల్లా కాపాడుతాడు అని చెప్పటానికి ఇది ప్రతీక.
