హైదరాబాద్: నైజాంలో అఖండ2 బుకింగ్స్ ఓపెన్ కావడంతో బాలయ్య అభిమానులు ఫుల్ జోష్లో ఉన్నారు. తెలంగాణలో అఖండ-2 సినిమా టికెట్ ధరలు పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఈ మేరకు ధరలను ప్రకటిస్తూ జీవో జారీ చేసింది. డిసెంబర్ 12న దేశవ్యాప్తంగా విడుదలవుతున్న అఖండ2 సినిమా ప్రీమియర్స్ 11న రాత్రి 9 గంటలకే పడనున్నాయి.
డిసెంబర్ 11న రాత్రి 9 గంటలకు ప్రదర్శించే ప్రీమియర్ షో ధర 600 రూపాయలకు అమ్ముకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. డిసెంబర్ 12 నుంచి 14 వరకు మల్టీప్లెక్స్‌ల్లో రూ.100 పెంపు, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్‌పై రూ.50 పెంచుకునేందుకు రేవంత్ సర్కార్ అనుమతినిచ్చింది. అఖండ2 సినిమా రిలీజ్ కష్టాలను దాటుకుని విడుదలవుతున్న సంగతి తెలిసిందే.
14 రీల్స్ ప్లస్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 5నే విడుదల కావాల్సి ఉండగా.. Erosతో వివాదం.. ఫైనాన్స్ కష్టాలు ఎదురవడంతో విడుదల వాయిదా పడింది. ఈ వివాదాలను పరిష్కరించుకుని డిసెంబర్ 12న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. డిసెంబర్ 11న రాత్రి 9 గంటలకు తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ షోతో అఖండ2 తాండవం మొదలవుతోంది. బోయపాటి, బాలకృష్ణ కాంబోలో వచ్చిన అఖండ సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సీక్వెల్గా అఖండ 2 సినిమా తెరకెక్కింది.
ALSO READ : 'అఖండ 2: తాండవం' ఎఫెక్ట్... వెనక్కి తగ్గిన చిన్న సినిమాలు!
అఖండ 2 తాండవం రిలీజ్ టీజర్ను చిత్ర బృందం తాజాగా విడుదల చేసింది. థమన్ బీజీఎం ఈ సినిమాకు మరోసారి హైలైట్గా నిలిచేలానే కనిపిస్తోంది. ఈ సినిమాలో బాలయ్య సరసన సంయుక్త మీనన్ స్టెప్పులేసింది. బుక్ మై షో, డిస్ట్రిక్ట్ వెబ్ సైట్స్లో ప్రస్తుతానికి డిసెంబర్ 12న ఉదయం షోల నుంచి టికెట్లను అందుబాటులో ఉంచారు. డే1 బుకింగ్స్ కంప్లీట్ అయిన తర్వాత డిసెంబర్ 11న రాత్రి 9 గంటల షో టికెట్లను అందుబాటులో ఉంచే అవకాశం ఉంది.

